కొట్టుకోవడం, తిట్టుకోవడం.. ఇది నిన్న మండలిలో జరిగింది  

ఉభయ సభల్లో మాటల యుద్దాలు జరగడం మనం చూశాం.  ఒక్కోసారి పరిస్థితి చేయిదాటి నాయకుల మధ్య బూతులు, తోపులాటలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.  కానీ ఈసారి జరిగిన మండలి సమావేశాల్లో అంతకన్నా ఎక్కువే చేశారు మన నేతలు.  పెద్దల సభకు ఉండాల్సిన గౌరవ మర్యాదలను మరిచి కొట్టుకునే వరకు వ్యవహారం వెళ్ళింది.  నిన్నటి సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్సీలు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారట.  సభా సమావేశం లైవ్ స్త్రీమింగ్ వెసులుబాటు లేకపోవడంతో నేతలకి అడ్డు అదుపు లేకుండా పోయిందట.  
 
సిఆర్డీయే, మూడు రాజధానుల బిల్లుల ఆమోదమే లక్ష్యంగా వైకాపా సభలోకి అడుగుపెడితే శాసన సభలో అడ్డుకోలేకపోయిన బిల్లులను మండలిలో సంఖ్యా బలంతో హోల్డ్ చేసి అధికార పక్షం దూకుడు కళ్లెం వేయాలని టీడీపీ రంగంలోకి దిగింది.  దీంతో సభ రసాభాసగా మారింది.  మండలి సభ్యులైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపె విశ్వరూప్‌, పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, అవంతి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేశ్‌, కురసాల కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్, వెల్లంపల్లి, లోకేష్, యనమల, బీద రవిచంద్ర, బాబూ రాజేంద్రప్రసాద్ లాంటి వారంతా నోటికి పని చెప్పగా కొందరు చేతులు కూడా వాడారు. 
 
సభలో ముందుగా బడ్జెట్ ఆమోదించాలా లేకపోతే ఇతర బిల్లులను ఆమోదించాలా అనే విషయమై వాగ్వాదం మొదలైంది.  టీడీపీ ముందుగా ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదిద్దామని అంటే బుగ్గనతో సహా వైసీపీ నేతలంతా ఇతర బిల్లులను ఆమోదించాలని పట్టుబట్టారు.  కాసేపటికి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కూడా ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించుకుందాం అనడంతో గొడవ పెద్దదైంది.  మొదట యనమల, పిల్లి సుభాష్ వాదనలు చేసుకోగా ఆ తర్వాత మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ గొడవకు దిగారు.  రాజేంద్రప్రసాద్ వైసీపీలో తిరుగుబాటును ప్రస్తావించగా మంత్రి అనిల్ తొడ కొడుతూ ఆయన మీదకు వెళ్లారు. 
 
ఇక మంత్రి వెల్లంపల్లి అయితే లోకేష్ ఫొటోలు తీస్తున్నారంటూ ఆయన మీదకు వెళ్ళే ప్రయత్నం చేయగా బీద రవిచంద అద్దుపడ్డారు.  ఆ తోపులాటలో వెల్లంపల్లి కిందపడటంతో కోపంతో బీదను తన్నారని, బీద కూడా వెల్లంపల్లిని తన్నినట్లు వార్తలు వస్తున్నాయి.  ఇక బయటికొచ్చిన ఇరు పార్టీల నేతలు ప్రెస్ ముందు తమ మీద దాడి జరిగిందంటే తమ మీద జరిగిందని ఎవరి వెర్షన్ వారు ఎకవరువు పెట్టారు.  మొత్తం మీద మండలి తిట్లు, తన్నులకే పరిమితమైంది తప్ప కీలకమైన రాజధాని, సీఆర్డీయే, ద్రవ్యవినినయమ బిల్లుల ఆమోదం లేకుండానే నిరవధిక వాయిదా పడింది.