కేసీఆర్ సర్కార్ కొత్త ట్రిక్.. టెస్టుల వివరాలే లేపేశారు 

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ ఆగడంలేదు.  రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు.  ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా కేసీఆర్ సర్కార్ తీరు మెరుగుపడకపోవడం ఆశ్చర్యకరం.  ప్రతిపక్షాలు ఇప్పటికే టెస్టులు విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆరోపణలు చేస్తుండగా హైకోర్టు సైతం కేసీఆర్ సర్కార్ కరోనా కట్టడిలో పూర్తిగా చేతులు ఎత్తివేసినట్టుందని చురకలు వేస్తూ ప్రజలే తమ ప్రాణాలను రక్షించుకోవాలని సూచన చేసింది.  అంతేకాదు ఈ విషయంలో మరింత కఠినంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటే అలాగే ఉంటామని హెచ్చరించింది.  
 
దీంతో ప్రభుత్వం తీరు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అయినా కేసీఆర్ సర్కార్ మాత్రం వైరస్ కట్టడిలో తాము సమర్థవంతంగానే పని చేస్తున్నామని వారిస్తోంది.  ఈ నేపథ్యంలో రోజుకు ఎన్ని టెస్టులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారో హెల్త్ బులిటెన్లో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.  దీంతో ప్రభుత్వం వరుసగా రెండు రోజులు టెస్టుల సంఖ్యను వెల్లడించింది.  వాటిలో 16వ తేదీన 1251 టెస్టులు చేయగా 213 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.  17వ తేదీన 1096 టెస్టులు చేయగా వాటిలో 269 పాజిటివ్ వచ్చాయు.  ఈ లెక్కలతో రాష్ట్రంలో వైరస్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమయింది.  
 
అంతేకాదు ప్రభుత్వం రోజుకు కేవలం 1200 లేదా 1100 టెస్టులు మాత్రమే చేస్తున్నట్టు రూఢీ అయింది.  ఈ లెక్కలు చూశాక పరీక్షలు పెద్ద ఎత్తున జరగడంలేదని ప్రజలు కూడా అంటున్నారు.  దీంతో ప్రభుత్వం మరోసారి టెస్టుల సంఖ్యను దాచిపెట్టే ప్రయత్నం చేసింది.  నిన్న విడుదల చేసిన బులిటెన్లో అసలు కండక్ట్ చేసిన టెస్టుల సంఖ్య అనే కాలమ్ పూర్తిగా తొలగించి 352 పాజిటివ్ కేసులు వచ్చినట్టు తెలిపారు.  ఈ బులిటెన్ చూసిన జనం, ప్రతిపక్షాలు మరోమారు ప్రభుత్వం లెక్కల్ని దాచిపెడుతోందని, హైకోర్టు చెప్పినా టెస్టుల సంఖ్య పెంచకపోవడం దారుణమని ఆరోపణలు చేస్తున్నారు.  మరి ప్రభుత్వం కూడా టెస్టుల సంఖ్యను దాచిపెట్టడం వెనుక కారణం ఏమిటనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.