తప్పు చేసినా అండగా ఉంటారా.. ఇదేం పద్దతి సాయిరెడ్డిగారు

 

 
ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు నడుమ సైలెంట్ వార్ నడుస్తోంది.  రంగుల జీవో, ఎలక్షన్ కమీషనర్ రమేష్ కుమార్ వంటి పలు అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి.  దీంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహానికి గురయ్యారు.  పలువురు ముఖ్యులు బాహాటంగానే తీర్పును వ్యతిరేకిస్తే వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కోర్టుల మీద అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెట్టారు.  దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం ఆమంచి, నందిగం సహా 49 మందికి నోటీసులు పంపింది.  రెండో దఫా కూడా ఇంకొందరు సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు వెళ్లాయి.  
 
దీంతో కార్యకర్తల్లో, పార్టీలో ఆందోళన మొదలైంది.  జగన్ యేడాది పాలన సందర్బంగా ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ కేసులపై స్పందించారు.  మొదట వైసీపీ సోషల్ మీడియాను మొదటి నుండి తానే చూసుకుంటున్నాను అని క్లారిటీ ఇచ్చిన ఆయన గతంలో కూడా టీడీపీ సర్కార్ తమ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడితే కాపాడుకున్నాం అంటూ ఈసారి కూడా ఎవరైతే నిజాయితీగా పార్టీ కోసం పనిచేశారో వారికి అండగా ఉంటామని అన్నారు.  ఏకంగా వారిని వీరసైనికులుగా అభివర్ణించారు.  
 
అలాగే న్యాయస్థానం మీద తమకు పూర్తి గౌరవం ఉందని అంటూ అభియోగం మోపబడిన వారంతా నేరస్తులు అయిపోరని, నేరం రుజువు కాకపోతే ఇన్నొసెంట్స్ అవుతారని, ఒకవేళ ఎవరైనా తప్పు చేసినట్టు నిరూపితమైతే శిక్షించాలనే మేమూ కోరుకుంటున్నాం అన్నారు.  ఇంతవరకు బాగానే మాట్లాడిన సాయిరెడ్డిగారు ఆ తర్వాత ఒక చిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు.  ఒకవేళ ఎవరికైనా శిక్ష పడినా అంటూ వాఖ్యం స్టార్ట్ చేసి గతంలో వైఎస్ రాజశేఖర్  రెడ్డిగారు తన అనుచరుడు శిక్షపడి జైల్లో ఉంటే నేరుగా వెళ్లి పరామర్శించి వచ్చారనే సంగతిని గుర్తుచేస్తూ తాము కూడా కేసులో ఇరుక్కున్నంత మాత్రాన కార్యకర్తను వదులుకోమని, వారికి అండగా ఉంటామని, అదే పార్టీకి, కార్యకర్తలకి ఉన్న స్నేహమని అన్నారు. 
 
అంటే నోటీసులు అందుకున్న వారిలో రేపు ఎవరికైనా కోర్టు శిక్ష విధిస్తే వారికి బెయిల్ లాంటి ఏర్పాట్లు ఉంటాయని పరోక్షంగా అనేశారు.  పార్టీకి కార్యకర్తల పట్ల భాద్యత ఉండటంలో తప్పు లేదు.  ఉండాలి కూడ.  రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి న్యాయపరమైన ఆసరా ఇవ్వొచ్చు కానీ న్యాయస్థానమే పెట్టిన కేసుల్లో శిక్ష పడినా అండగా ఉంటాం అనడమే విపరీతం.  ఇది వ్యవస్థల విషయంలో హద్దులు దాటుతున్న కార్యకర్తలను అదుపు చేయడం మాట అటుంచి మీ వెనక మేమున్నాం అంటూ ఇంకాస్త రెచ్చగొట్టడమే అవుతుంది.  కాబట్టి వైసీపీ నేతలు ఇకమీదటైనా తమ వ్యాఖ్యల ద్వారా జనాలు, శ్రేణుల్లోకి ఇలాంటి రాంగ్ ఇండికేషన్స్ వెళ్లకుండా జాగ్రత్తపడితే మంచిది.