ఓడితే బాధపడలేదు సరే.. తర్వాతైనా ట్రెండ్ మార్చాలిగా పవన్ 

 

ఓడితే బాధపడలేదు సరే.. తర్వాతైనా ట్రెండ్ మార్చాలిగా పవన్ 

2019 ఎన్నికల్లో జనసేనను దాదాపు పూర్తిస్థాయిలో బరిలోకి దింపారు పవన్ కళ్యాణ్.  ఎన్నికలకు కొత్త కావడం, పవన్ మినహా ప్రజాకర్షణ కలిగిన నేతలు లేకపోవడం, ఇతర పార్టీల మాదిరి డబ్బుతో ఎన్నికల్ని మేనేజ్ చేసే సామర్థ్యం, అసలు ఆ ఆలోచనే లేకపోవడంతో పార్టీ అధికారాన్ని దక్కించుకోవడం అసాధ్యమని అందరికీ తెలుసు.  పవన్ సైతం తాను అధికారాన్ని అందుకోలేనని బాహాటంగానే చెప్పారు.  ఓటమికి రెడీ అని కూడా అన్నారు.  కానీ ఓడిపోతాం అనుకున్నారు కానీ మరీ దారుణంగా ఓడిపోతామని మాత్రం జనసేన శ్రేణుకు కూడా ఊహించలేదు. 
 
కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  17 లక్షల ఓట్లే పార్టీకి పడ్డాయి.  వీటన్నింటి కంటే పెద్ద కష్టం పవన్ కూడా అపజయం పాలవ్వడం.  పోటీ చేసిన రెండు చోట్ల ఆయన ఓడిపోయారు.  ఈ ఓటమి జనసైనికుల్ని మరింత కుంగదీసింది.  ఈ ఓటమితో జనసేన మూతబడటం ఖాయమని, పవన్ అడ్రెస్ గల్లంతవుతుందని అందరూ కామెంట్స్ చేశారు.  కార్యకర్తలు, అభిమానులు సైతం ఈ పరాభవాన్ని పవన్ ఎలా తీసుకుంటారో, అసలు ఇప్పట్లో ఆయనకు కోలుకోవడం సాధ్యమేనా అని ఆందోళన పడ్డారు అందరూ. 
 
కానీ ఊహించని రీతిలో పవన్ నిలబడ్డాడు. 
ఓటములు సహజం, ఈ ఓటములు నా ప్రయాణాన్ని ఆపలేవు.  జనం నుండి నలుగురు నన్ను మోసేవరకు నేను జనసేనను మోస్తూనే ఉంటాను అంటూ తన పాతికేళ్ల రాజకీయ స్వప్నాన్ని గుర్తుచేశారు.  దీంతో కార్యకర్తల్లో ధైర్యం నిండింది.  కానీ మెల్లగా నాయకులు కూడా పార్టీ నుండి వెళ్లిపోవడం మరో దెబ్బ.  దానికి కూడా నాతో ప్రయాణం చేయగలిగినవారే నాతో ఉంటారు అంటూ మాట్లాడారు.  ఆ తర్వాత అధికారం చేపట్టడం వైకాపాకు కొత్త కాబట్టి కొంచెం టైమ్ ఇచ్చి చూద్దాం అన్నారు.  ఆ మాట మేరకే కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు. 
 
ఇలా ఓటమిని లైట్ తీసుకోవడం ల, కార్యకర్తల్ని మోటివేట్ చేయడం, రాజకీట క్షేత్రంలో ధైర్యంగా నిలబడటం అన్నీ బాగానే ఉన్నాయి.  కానీ నెక్స్ట్ టైమ్ ఎన్నికలకు అయినా బలపడాలి కదా.  అలా బలపడాలంటే కేవలం ప్రశ్నిస్తే, సేవా కార్యక్రమాలు చేస్తే చాలదు.  జనాన్ని తనవైపు తిప్పుకోవాలి.  జనసేన అంటే ఆ పార్టీనా.. అసలు దానికి భవిష్యత్తు ఉంటుండా అనే జాలితో కూడిన అభిప్రాయం ఉంది జనంలో.  ముందు అది పోవాలి.  తాము కూడా ప్రత్యామ్నాయం కాగలమనే నమ్మకాన్ని జనానికి కలిగించాలి.  మార్పు అనే తమ నినాదాన్ని ప్రజలకు ఒక ఎమోషన్ మాదిరి అలవాటు చేయాలి.  అప్పుడే భవిష్యత్తు ఉంటుంది.  అప్పుడే గత ఓటమి నుండి పాఠాలు నేర్చుకున్నట్టు అవుతుంది.  
 
కానీ ఈ పని పార్టీలో జరుగుతుందా అంటే లేదనే అనాలి.  పవన్ ఇంకా ఆరంభంలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నట్టుంది.  రాజకీయాలు చేయగల ఆలోచనా ధోరణి ఆయనకు ఇంకా అలవాటు కాలేదు.  సమస్యలను గుర్తిస్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో ఎలివేట్ చేయలేకపోతున్నారు.  బలమైన లోకల్ లీడర్లను ఇంకా తయారుచేసుకోలేదు.  అసలు జనంలో చాలామందికి జనసేన విధి విధానాలు గురించి ఇంకా పూర్తిగా తెలీదనడంలో అతిశయోక్తికాదు.  పైగా పార్టీకి మీడియా సపోర్ట్ కూడా లేదు.  కాబట్టి పవన్  ఈ యేడాదిలో ఓటమి నుండి ఏం నేర్చుకున్నాం అని సింహావలోకనం చేసుకుని వాస్తవ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ట్రెండ్ మార్చుకుని  ముందుకు వెళ్లగలిగితే పార్టీ భవిష్యత్తు మెరుగుపడుతుంది.