ఇంగ్లీష్ మీడియం ద్వారా జగన్ క్రిస్టియానిటీ ప్రచారం.. అసలు నిజమేమిటి 

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఏకైక మీడియంగా ఉండాలని వైఎస్ జగన్ సర్కార్ పట్టుబడుతోంది.  హైకోర్టు తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయడం సరికాదని, తల్లిదండ్రులకు, పిల్లలకు ఛాయిస్ ఉండాలని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 81, 85 లను రద్దు చేసింది.  అయినా జగన్ సర్కార్ ప్రజాభిప్రాయం పేరుతో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  అసలు పూర్తిగా తెలుగు మీడియం రద్దు చేయడం సరైనదేనా, నిజంగా 80 శాతానికి పైగా తల్లిదండ్రులు ఒన్లీ ఇంగ్లీష్ మీడియమే కావాలనుకుంటున్నారా అనే విషయాలను న్యాయస్థానాలు తేలుస్తాయి కానీ ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు క్రిస్టియానిటీ అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. 
 
ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అయితే జగన్ రాష్ట్రం మొత్తం ఇంగ్లీష్ మీడియం మయం చేసి క్రిస్టియానిటీని ప్రచారం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని విమర్శిస్తోంది.  అసలు భాషకు, మతానికి మధ్య లింక్ పెట్టడంలోనే భాజాపా తెలివితక్కువ తనం బయటపడుతోంది.  ఒక మనిషి ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన క్రైస్తవుడిగా మారిపోతాడని అనడం ఎంత అవివేకం.  అలాగైతే ఏపీలో కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే భోదించే పాఠశాలలు చాలానే ఉన్నాయి.  వాటిలో చదివిన, చదువుతున్న వారందరూ క్రైస్తవులుగా మతం మార్చుకున్నారేమో భాజాపా నేతలు చెప్పాలి. 
 
ఒకవేళ ఇంగ్లీష్ మీడియం క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసి, హిందూ మతాన్ని బలహీనపరుస్తుందనేదే భాజాపా నమ్మకమైతే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని రద్దు చేస్తూ రాజ్యసభలో బిల్లు పెట్టొచ్చు కదా.  అలా చేయరు.. ఎందుకంటే వారి వాదనలో ఏమాత్రం వాస్తవం లేదు కాబట్టి.  అవి కేవలం వారి మత ఛాందస వాదపు మాటలు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి చేసే అసత్యపు వాదనలు మాత్రమే.  తెలుగు మీడియం రద్దును వ్యతిరేకించే ఇతరులు సైతం మాతృ భాషలో ప్రాథమిక విద్యా బోధన అవసరమని, పిల్లలకు ఛాయిస్ ఉండాలనే, అది వారి హక్కని అంటున్నారే తప్ప బీజేపీ తరహాలో మతాన్ని వివాదంలోకి లాగడం లేదు.  సో ఇంగ్లీష్ మీడియం పేరుతో జగన్ క్రిస్టియానిటీని ప్రచారం చేస్తున్నారనే విమర్శలు ముమ్మాటికీ తప్పే.