ఆత్మకూరు బై పోల్: బీజేపీ ఆత్మ విమర్శ చేసుకుంటుందా.?

BJP

దాదాపు ఇరవై వేల ఓట్లు వచ్చాయ్.. ఇదీ బీజేపీ సత్తా.. అని బీజేపీ నేతలు చెప్పుకుంటే, ఇక మాట్లాడుకోవడానికి ఏముంటుంది.? ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నిక అది. పైగా, చనిపోయింది మాజీ మంత్రి. ఆయన సోదరుడే ఎన్నికల బరిలోకి దిగాడు.

సరే, ప్రజాస్వామ్యం అన్నాక, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అన్ని రాజకీయ పార్టీలకూ వుంటుందనుకోండి.. అది వేరే సంగతి. వారసత్వ రాజకీయాల్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది కాబట్టి, ఎన్నికల బరిలో బీజేపీ నిలవడాన్ని తప్పు పట్టలేం. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించే బీజేపీ, ఆ పార్టీ ఫిరాయింపులపై ఆందోళన చేయడం అనేది తరచూ జరుగుతుంటుంది.
బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమిది.!

ఔను, బీజేపీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందే. తెలంగాణలో బీజేపీ పప్పులుడుకుతాయేమోగానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదు. భవిష్యత్తులో వుండబోదు కూడా. దానికి కారణాలు అనేకం. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, ఏపీకి చేసిన అన్యాయాన్ని ఎన్ని సంవత్సరాలైనా ప్రజలు మర్చిపోయే ప్రసక్తి వుండదు.

చిత్రమేంటంటే, ఇక్కడ బీజేపీతో అంట కాగుతూ, జనసేన కూడా నష్టపోతోంది. బీజేపీ కబంధ హస్తాల నుంచి బయటకు వస్తే తప్ప, జనసేన పార్టీకి కూడా ఉనికి లభించే అవకాశం వుండదు.

బీజేపీకి ఆత్మకూరులో పడ్డ ఆ కాసిని ఓట్లు కూడా, కొందరు టీడీపీ మద్దతుదారులు, కొందరు జనసేన మద్దతుదారులల వల్లనే కావొచ్చు.!