అచ్చెన్నాయుడికి కొద్దిగా రిలీఫ్ దొరికింది 

K Atchannaidu
టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు కోర్టులో వరుసగా ప్రతికూలత ఎదురవుతూ వచ్చిన సంగత తెలిసిందే.  ఆయన తరపున దాఖలైన ప్రతి పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చుతూ వచ్చింది.  దాంతో ఆయనకు పోలీసుల నుండి, కస్టడీ నుండి, ప్రభుత్వ ఆసుపత్రుల నుండి వెసులుబాటు లేకుండా పోయింది.  కానీ ఇన్నాళ్లకు ఆయనకు హైకోర్టులో సానుకూలమైన ఆదేశాలు వెలువడ్డాయి.  అచ్చెన్నాయుడిని ప్రవేట్ ఆసుపత్రికి తరలించాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.  కానీ ప్రభుత్వం న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.   అచ్చెన్నాయుడును ఏ ఆస్పత్రికి తరలించాలన్నది ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్థారించాలని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.  కానీ ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదనను ధర్మాసానం తోసిపుచ్చింది.  
 
ఈ ఉత్తర్వులతో అచ్చెన్నాయుడును ఆసుపత్రికి తరలిస్తారని తెలుస్తోంది.  దీంతో పోరాడుతున్న అచ్చెన్నాయుడుకు, టీడీపీకి కొంత ఉపశమనం దొరికినట్లయింది.  అరెస్టైన దగ్గర్నుండి అచ్చెన్నాయుడు ఆరోగ్యం పట్ల పలు ఇబ్బందులు ఎదురయ్యాయి.  సర్జరీ అయిన మరుసటి రోజే అరెస్టు చేసి రోడ్డు మార్గం ద్వారా తరలించడంతో ఆయనకు సమస్యలు తలెత్తాయి.  సమస్య తిరగబెట్టి మళ్లీ ఆపరేషన్ వరకూ వెళ్ళింది పరిస్థితి.  గత వారం కూడా జీజీహెచ్ నందు చికిత్స పొందుతున్న ఆయన్ను హుటాహుటిన డిశ్చార్జ్ చేసి విజయవాడ సబ్ జైలుకు తరలించారు.  
 
దీంతో అచ్చెన్నాయుడు తనకు ఆరోగ్యం సరిగా లేదని, అయినా వినకుండా సబ్ జైలుకు తీసుకెళ్ళారని, తనకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందే వెసులుబాటు కల్పించాలని లాయర్ ద్వారా కోర్టులో పిటిషన్ వేశారు.  ఆ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆయన కోరుకున్నట్టే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకునే అవకాశం ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.  శ్రీకాకుళంలో అరెస్టయిన రోజు నుండి ఇప్పటి వరకు విచారణ, కస్టడీల పేరుతో పోలీసులు, ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును చాలా కఠినంగా ట్రీట్ చేస్తూ వచ్చిన నేపథ్యంలో ఈరోజు కోర్టులో ఆయనకు కొంత వెసులుబాటు దొరికినట్లయింది.