హైకోర్ట్ ఎఫెక్ట్.. లీగల్ టీమ్ ప్రక్షాళనలో జగన్ సర్కార్

గత కొన్నిరోజులుగా హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే.  ఏ నిర్ణయాల్లో అయితే ప్రభుత్వం మంకు పట్టు పట్టుకుని కూర్చుందో ఆ నిర్ణయాలనే హైకోర్టు తప్పుబట్టడం, హైకోర్టు తీర్పుల మీద ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడం, అక్కడ కూడా నిరాశ ఎదురుకావడంతో జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  సుమారు 60కి పైగా కేసుల్లో ప్రభుత్వ నిర్ణయాలు సరైనవి కావని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.  దీంతో ప్రత్యర్థులకు ప్రభుత్వాన్ని విమర్శించడానికి గొప్ప స్టఫ్ దొరికినట్టైంది.  
 
టీడీపీ ప్రధానంగా ఈ కేసుల వ్యవహారాన్ని పట్టుకునే ప్రభుత్వంపై అసమర్థ ముద్ర వేయాలని ట్రై చేసింది.  అందులో కొంతవరకు విజయం సాధించింది కూడ.  అదే సీఎం జగన్మోహన్ రెడ్డికి చికాకు తెప్పించింది.  అంతే వెంటనే లీగల్ టీమ్ ప్రక్షాళనకు పూనుకున్నారు.  ఇప్పటికే ప్రభుత్వ న్యాయవాదులు పెనుమాక వెంకటరావు, గడ్డం సతీష బాబు, షేక్ హబీబ్ రాజీనామా చేయగా వారి స్థానంలో కొత్త జీపీల నియామకం కూడా ముగిసింది.  
 
అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం అయితే జీపీల పనితీరుపై ప్రత్యేక దృష్టిపెట్టారు.  పనితీరు బాగాలేదనే కారణంగా మరో నలుగురు జీపీలను, 14 మంది ఏజీపీలను తొలగించాలని నిర్ణయించారు.  త్వరలో హైకోర్టు కార్యకలాపాలు మొదలుకానుండటంతో వారి స్థానంలో కొత్తవారిని నియమించే పనిలో ఉన్నారు.  ఈ మార్పులన్నీ హైకోర్టులో ఎదురవుతున్న భంగపాటు మూలంగానేనని స్పష్టంగా తెలుస్తోంది.  మరి ఈ కొత్త జీపీలు, ఏజీపీలు అయినా సరైన సలహాలు, సూచనలు ఇచ్చి కోర్టుల ముందు ప్రభుత్వం పరువు నిలబడేలా చేయాలి.  సర్కార్ పెద్దలు సైతం న్యాయవాదులకు చెప్పింది చేయండి అన్నట్టు కాకుండా సలహాల విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తే బాగుంటుంది.