సీఎం జ‌గ‌న్ అండ్ టీమ్ కి బాల‌కృష్ణ లేఖ‌ల వ‌ర్షం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటుపై క‌స‌ర‌త్తులు ముమ్మ‌రం చేసిన సంగ‌తి తెలిసిందే. 13 జిల్లాల‌ను 25 జిల్లాలుగా మారుస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ ముందుకు వెళ్తోంది. ఇప్ప‌టికే ప‌ల‌వురు మంత్రులు జిల్లాల ఏర్పాటు గురించి కొన్ని జిల్లాల ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసే ప్ర‌య‌త్నం చేసారు. ఈ నేప‌థ్యంలో శ్రీకాకుళం స‌హా ప‌లు జిల్లాలు విభ‌జ‌న‌కు సొంత పార్టీ నేత‌లే అడ్డు త‌గిలే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటుతో రాజ‌కీయంగా దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌బ్లిక్ గానే చెప్పారు. కొంద‌రు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు జిల్లాల ఏర్పాటుపై ఎవ‌రి అభిప్రాయాలు వారు చెప్పుకొచ్చారు.

ఇక ఈనెల 15న జ‌రిగే మంత్రి వ‌ర్గం భేటీలో ఈ అంశాల‌న్నింటిపై ప్ర‌ధానంగా చ‌ర్చించే అవ‌కాశం క‌నిపిస్తోంది. జ‌గ‌న్ అత్య‌వ‌సర‌ భేటీ వెనుక అస‌లు కార‌ణం కూడా ఇదే అయి ఉంటుంద‌ని పార్టీలో కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ హిందుపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ లేఖ సీఎం జ‌గ‌న్ కు ప్ర‌త్యేకంగా రాసారు. హిందుపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాల‌ని లేఖ‌లో కోరారు. జిల్లా ఏర్పాటుకు హిందుపురంకు అన్ని అర్హ‌తులున్నాయ‌న్నారు. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగుళూరు న‌గ‌రానికి బాగా ద‌గ్గ‌రగా ఉంటుంద‌ని, జిల్లా ఏర్పాటుకు కావాల్సినంత స్థ‌లం కూడా హిందుపురం లో ఉంద‌న్నారు.

అలాగే ఏపీ సీఎస్ నీలం సాహ్నికి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి కూడా బాల‌య్య లేఖ‌లు రాసారు. హిందుపురం స‌మీపంలోని మ‌లుగూరు వ‌ద్ద మెడిక‌ల్ క‌ళాశాల ఏర్పాటు చేయాల‌ని లేఖ‌లో విజ్ఞ‌ప్తి చేసారు. జ‌నాభ ప‌రంగా, ఇత‌ర అవ‌స‌రాల ప‌రంగా అక్క‌డ క‌ళాశాల‌తో పాటు ఆసుప‌త్రి ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ప్ర‌భుత్వానికి తెలియ‌జేసారు. మ‌రి ఈ లేఖ‌పై జ‌గ‌న్ ఎలా స్పందిస్తారు? మ‌ంత్రి రియాక్ష‌న్ ఎలా ఉంటుంది? అన్న‌ది తెలియాలి. జిల్లా ఏర్పాటుకు హిందుపురం అన్ని ర‌కాలుగా అర్హ‌త క‌ల్గినదే. పారిశ్రామికంగాను అభివృద్ది ప‌రిచే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. అయితే ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పెట్టింది పేరుగా హిందుపురంకి మ‌రో పేరు కూడా ఉంది. ఆ నియోజ‌క వ‌ర్గం టీడీపీకి కంచుకోట అన్న సంగ‌తి తెలిసిందే.