శ్రీవారికి భక్తులిచ్చిన కానుకలను ఆస్తులుగా చూడటం సబబు కానే కాదు
ప్రజెంట్ స్టేట్లో నడుస్తున్న హాట్ టాపిక్ శ్రీవారి ఆస్తుల వేలం. టీటీడీ పాలకమండలి నిరర్థకమైనవని చెబుతూ తమిళనాడులోని 23 చిన్నా చితకా ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని అనుకుంటోంది. దీనిపై ప్రతిపక్షం టీడీపీ, భాజాపా నేతలు ప్రశ్నిస్తే మీ హయాంలో, మీ పార్టీ వారే పాలకమండలిలో సభ్యులుగా ఉన్నప్పుడు వేలం వేయాలని భావించి, లెక్క కట్టి, ఆమోదం తెలిపిన ఆస్తులనే ఇప్పుడు విక్రయించాలని భావిస్తున్నట్టు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిగారు సెలవిచ్చారు. ఈ వాదనతో రాజకీయ పార్టీలు సైలెంట్ అయినా ప్రజలు, భక్తులను మాట్లాడకుండా చేయలేరు కదా.
ఈ వ్యవహారంపై సామాన్య జనం అసలు శ్రీవారికి భక్తులు ప్రేమతో, భక్తితో ఇచ్చిన కానుకలను ఆస్తులుగా చూడటం పాలకమండలి మానుకోవాలని లేకపోతే అమ్మకం అలవాటుగా మారుతుందని అప్పుడు కాకుకలిచ్చే భక్తులు కూడా వెనక్కుపోతారని అంటున్నారు. వారి వాదనలో నూటికి నూరు శాతం నిజముంది. ఎందుకంటే భక్తులు తమ స్థాయిలను బట్టి దేవుడికి కానుకలు ఇస్తారు. వారిలో అందరూ పేదలు, మధ్యతరగతివారు ఎక్కువగా ఉంటారు. వీరంతా కోటీశ్వరుల మాదిరి ఎకరాలకు ఎకరాలు, నగరాల్లో భవనాలు, ఖరీదైన ఆభరణాలు ఇవ్వలేరు. ఏదో వారికి కలిగినది కొంచెం ఇచ్చుకుంటారు.
అలాంటి కానుకలను పనికిరానివని, నిర్వహించడం కష్టమని చెప్పి అమ్మేస్తే వారి మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. తామిచ్చిన కానుకలు శ్రీవారి సేవలో లేకుండా పోతున్నాయే అని భాధపడతారు. ఇవన్నీ ఆస్తులు, అమ్మకాలు అనే కోణంలో చూస్తే అర్థంకావు. భక్తులు, కానుకలు అనుకొని ఆలోచిస్తే తెలుస్తాయి. అయినా ఆస్తుల నిర్వహణ కష్టమని అనడం టీటీడీ లాంటి అతి పెద్ద దేవస్థాన వ్యవస్థకు తగిన మాట కానే కాదు. ఆ చిన్నపాటి స్థలాల్లో సత్రాలు, ప్రాథమిక వైద్యశాలలు, దేవాలయాలు, భజన మందిరాలు కట్టవచ్చు.
అలా చేస్తే ఆ కానుకలిచ్చిన భక్తులకు తాము శ్రీవారి సేవలో ఉన్నామనే భావన కలుగుతుంది. అంతేకానీ అమ్మేస్తే ఇలా అమ్మి సొమ్ము చేయదానికా మేము కానుకలు ఇచ్చింది అని నొచ్చుకుంటారు. అసలు టీటీడీ ఇంత మంకు పట్టు పట్టి అమ్మాలనుకుంటున్న తమిలనాడులోని ఆస్తుల విలువ రూ.2 కోట్ల లోపే ఉంటుందట. ఆ చిన్న మొత్తం కోసం లక్షల మంది భక్తులను నొప్పించడం ఎంతవరకు ప్రయోజనకరమో పాలకమండలి, ప్రభుత్వం ఆలోచించాలి.