టీడీపీ కప్పులో తుపాను ప్రస్తుతానికి చల్లారినట్లే. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడైన నారా లోకేష్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఓ వీడియో టేపు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ వల్లనే పార్టీ నాశనమయ్యిందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించినట్లుగా ఆ వీడియో టేపు రూపొందింది. అది ఒరిజినల్ టేప్ అనుకోవాలా.? లేదంటే, ఎవరైనా తయారు చేసిందా.? అన్నదానిపై స్పష్టత లేదు.
ఇదిలా వుంటే, ఈ వీడియో టేపు కారణంగా టీడీపీకి పెద్ద డ్యామేజీనే జరిగిపోయింది. దాంతో, తిరుపతిలో నారా లోకేష్ – అచ్చెన్నాయుడు కలిశారు.. వివాదానికి ముగింపు పలికేశారు. ఆ వీడియో టేపు గురించి ఇద్దరూ మాట్లాడలేదుగానీ, పక్కపక్కనే కూర్చుని గుసగుసలాడుకున్నారు.. తమ మధ్య విభేదాలేమీ లేవని తమ చర్యల ద్వారా చెప్పకనే చెప్పారు. ‘మమ్మల్ని విడదీయడానికి, టీడీపీని దెబ్బ కొట్టేందుకు వైసీపీ ఆడిన నాటకం..’ అంటూ వీడియో టేపు వెలుగు చూసిన రోజే అచ్చెన్నాయుడు బుకాయించిన విషయం విదితమే. వాస్తవానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడి నియామకాన్ని నారా లోకేష్ వ్యతిరేకించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ కారణంగానే అచ్చెన్న, టీడీపీ పట్ల అసహనంతో వున్నారనీ, ఏప్రిల్ 17 తర్వాత టీడీపీని వీడాలనుకున్నారనీ వీడియో టేపు తర్వాత వైసీపీ వర్గాల నుంచి ప్రచారం జరిగింది. అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారా.? లేదంటే, లోకేష్ స్వయంగా అచ్చెన్నను బుజ్జగించారా.? అన్నది పక్కన పెడితే, అచ్చెన్న – లోకేష్ మధ్య ఎలాంటి వివాదాల్లేవని తేలడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.