లాక్ డౌన్ ప్రచారం.. మద్యం అమ్మకాల కోసమే చేసినట్టుంది 

లాక్ డౌన్ ప్రచారం.. మద్యం అమ్మకాల కోసమే చేసినట్టుంది
హైదరాబాద్ సిటీలో కరోనా విజృంభణ ఎక్కువగా ఉండటంతో మరోసారి లాక్ డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.  ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం లాక్ డౌన్ విధింపు విషయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం చెబుతామని అన్నారు.  నగరంలో పెరిగిపోతున్న కేసులు, ప్రభుత్వం మీద పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో లాక్ డౌన్ ఖాయమనే అనుకున్నారు.  దానికి తోడు మీడియా ఛానెళ్ళు ఇదిగో ఇంకాసేపట్లో లాక్ డౌన్ ప్రకటన వచ్చేస్తుందన్న తరహాలో కథనాలు ఊదరగొట్టారు.  ఇవే లాక్ డౌన్ కొత్త నిబంధనలు అన్నారు. 
 
ఈ వ్యవహారం అంతా జరిగి వారం గడుస్తోంది.  కానీ ఇంకా లాక్ డౌన్ మీద క్లారిటీ లేదు.  అసలు సీఎం కేసీఆర్ మీడియా ముందుకొచ్చి వారమవుతోంది.  అయితే ఈ లాక్ డౌన్ విధిస్తారనే వార్తలతో ప్రభుత్వ ఖజానా మాత్రం గట్టిగా నిండింది.  మందు షాపులు మూసేస్తారేమోనన్న భయంతో మందు ప్రియులు జేబుల్లో ఉన్న డబ్బంతా ఊడ్చి పెద్ద ఎత్తున మందు కొనుగోలు చేశారు.  15 నుండి 20 రోజులకు సరిపడా స్టాక్ పెట్టుకున్నారు.  సీఎం లాక్ డౌన్ గురించి మాట్లాడిన తర్వాతి రెండు రోజుల్లో రూ. 350 కోట్ల అమ్మకాలు జరిగాయంటే సేల్స్ ఎంతలా పెరిగాయో అర్థమవుతోంది. 
 
జూన్ 29న రూ. 185 కోట్ల 45 లక్షల అమ్మకాలు జరగ్గా జూన్ 30న రూ. 164 కోట్ల అమ్మకాలు డిపోల నుండి జరిగాయి.  మే నెలలో రూ.1864 కోట్లు,  జూన్ నెలలో రూ. 2,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగితే కేవలం గత వారం రోజుల్లోనే రూ. 700 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి.  దీన్ని బట్టి లాక్ డౌన్ ప్రచారం బాగా పనిచేసి సర్కార్ ఖజానాకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెట్టింది.  ఇక ఇంత హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పటికీ లాక్ డౌన్ గురించి స్పష్టత ఇవ్వకపోవడంతో జనంలో ఇదంతా కావాలని సృష్టించిన హైప్ మాత్రమేనని అనుమానం కూడా కలుగుతోంది.