మహమ్మారి తమ వరకు వస్తే కానీ కేసీఆర్‌కు తెలియలేదు  

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చాప కింద నీరులా సాగుతోంది.  అయితే ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పనితీరు మెరుగ్గా ఉందని జనం అంటున్నారు.  దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉంటే తెలంగాణలో టెస్టుల సంఖ్య చాలా స్వల్పంగా ఉంది.  ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం చేసిన టెస్టుల సంఖ్య 40,000లు కూడా దాటలేదని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.  మొదటి నుండి కేసీఆర్ కేసుల సంఖ్యను తక్కువగా చూపడం కోసం టెస్టులు చేయడం లేదనే విమర్శలు వచ్చాయి.  
 
హైదరాబాద్లో రోజుకు కనీసం 100కు పైగా పాజిటివ్ కేసులు వస్తుండటంతో జనం సైతం ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేశారు.  ఎన్ని విమర్శలు వచ్చినా ఇన్నాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో టెస్టుల పట్ల వాదనలు తప్ప వేగం పెరగలేదు.  ఇప్పటివరకు తెలంగాణలో కేసులు 5000లకు చేరువలో ఉండగా మరణాలు 185గా ఉన్నాయి.  కానీ ఉన్నట్టుండి కేసీఆర్ రానున్న 10 రోజుల్లో రాష్ట్రంలో 50,000 టెస్టులు చేయనున్నామని ప్రకటించారు.  ఇది విని జనానికి కరోనా సోకితే టెస్టులు పెంచలేదు కానీ నేతలకి సోకే సరికి అమాంతం పెంచేశారే అంటున్నారు.  
 
అయితే ఈమధ్య ప్రజాప్రతినిధులకు సైతం కరోనా సోకడంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు.  మొదట జనగామ ఎమ్మెల్యే ముత్తురెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది.  దాంతో ఆయన్ను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  ఆయన భార్యకు, వంటమనిషి, గన్ మెన్ కు కూడా కరోనా సోకినట్టు నిర్థారణ అయింది.  ఇక తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ కూడా వైరస్ బారిన పడ్డారు.  దీంతో ఆయన్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఆయన కుటుంబ సభ్యులను, ఆయన్ను కలిసిన అధికారులను హోమ్ క్వారంటైన్ చేశారు.  ఇక మంత్రి హరీశ్ రావు వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ రావడంతో ఆయన కూడా హోమ్ ఐసొలేషన్లోకి వెళ్లారు.  
 
దీంతో ప్రజా ప్రతినిధుల్లో ఎంతమందికి కరోనా సోకిందో అనే అనుమానం అధిష్టానంలో మొదలైంది.  అందుకే ఒకేసారి రాబోయే పది రోజుల్లో 50,000 టెస్టులు చేయాలని ఆదేశించారు.  ఈ టెస్టులను హైదరాబాద్, వికారాబాడ్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డిలకు చెందిన 30 నియోజకవర్గాల్లో జరగనున్నాయి.  మొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో టెస్టులని తెలిసిన జనం తమ వరకు వస్తే కానీ చలనం కలగలేదు.. అదేదో మొదట్లోనే ఈ పని చేసుంటే ఈ కష్టం ఉండేది కాదు కదా అంటున్నారు.