ప్రజావేదిక గాయం ఇంకా పచ్చిగానే ఉంది 

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన ఆరంభ పనుల్లో ప్రజావేదిక కూల్చివేత కూడా ఒకటి.  చంద్రబాబు హయాంలో కృష్ణా నది కరకట్టపై నిర్మితమైన ప్రజావేదికను చట్టవిరుద్ధంగా నిర్మితమైందనే ఆరోపణతో హడావుడిగా కూల్చివేశారు.  ఇందులో స్వయానా సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టి మరీ పనిచేశారు.  ఈ కూల్చివేత టీడీపీ నేతలను తీవ్రంగా నొప్పించింది.  ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజావేదికను కాపాడుకోవాలని తెలుగుదేశం నేతలు చాలా ట్రై చేశారు.  నిరసనలు, దీక్షలు చేశారు.  కానీ సీఎం వేటినీ లెక్క చేయకుండా కట్టడాని కూల్చారు. 
 
 
 
అప్పటి నుండి జగన్ మీద ఎలాంటి విమర్శ చేయాలన్నా ప్రజావేదిక కూల్చివేత విషయాన్ని తెర మీదకి తెస్తుంటారు టీడీపీ నేతలు.  ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే ప్రజావేదిక కూల్చివేతను చూపుతూ వైసీపీది విధ్వంసక పాలననే మార్క్ వేశారు.  ఇక ఈరోజు గురువారంతో ప్రజావేదిక కూల్చబడి ఏడాది పూర్తయింది.  ఈ సందర్భాన్ని టీడీపీ ఎలివేట్ చేయాలని అనుకుంది.  పాత గాయాన్ని గుర్తు చేసుకుంటూ జనం ముందుకు వెళ్లాలని ప్లాన్ వేసింది.  
 
 
అనుకున్నదే తడవుగా టీడీపీ ముఖ్య నేతలు  దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, టి.శ్రావణ్‌కుమార్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబులు ప్రజావేదిక శిధిలాలను పరిశీలించే పేరుతో ఉండవల్లి కరకట్ట వద్దకు వెళ్లారు.  ఈ పరిణామాన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు ప్రజావేదిక వద్దకు వెళ్ళే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.  టీడీపీ నేతలను చెక్ పోస్టుల వద్దే ఆపేశారు.  దీంతో తెలుగు దేశం నేతలకు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. వారందరినీ పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషనుకు తరలించారు.  ఈ వివాదంపై చంద్రబాబు సహా టీడీపీ లీడర్లంతా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.