రాజకీయాల్లో ప్రత్యర్థుల నడుమ వాతావరణం ఒకలా ఉంటుంది శత్రువుల మధ్య వాతావరణం ఇంకోలా ఉంటుంది. శత్రువులు ఎప్పటికీ ఒకరికొకరు అభినందించుకోలేరు. నిత్యం పరస్పరం విషం చిమ్ముకుంటూ ఉంటారు. ఏళ్లు గడిచేకొద్దీ ఈ శత్రువుల నడుమ శతృత్వం పెరిగేదే తప్ప తగ్గదు. నిజంగా అవతలి వ్యక్తి మంచి పని చేసినా శతృవులు గుర్తించలేరు. అందుకు ఉదాహరణే టీడీపీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలు. ఈ రెండు పార్టీలు ఎప్పుడూ ప్రత్యర్థుల్లా కాకుండా శత్రువుల్లానే ఉంటారు. ఒకరినొకరు ఏమాత్రం ఆమోదించరు. వీలు చిక్కినప్పుడల్లా సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంటారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని నాళ్లు వైఎస్ జగన్ అయన మీద ప్రతి విషయంలోనూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అన్న క్యాంటీన్ లాంటి మంచి పనులు చేసినా వాటిలోనూ అవినీతి జరిగిందని ఆరోపణలు చేసేవారు. ఇక అధికారంలోకి వచ్చాక తెలుగు దేశం నాయకుల పట్ల జగన్ వ్యవహారశైలి ర్లా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీలోని ముఖ్యనేతల మీద కేసులు, ఆరోపణలు, అరెస్టులు ఇలా గందరగోళ పరిస్థితి. అసలు చంద్రబాబు అండ్ కో ప్రతిపక్ష పాత్ర పోషించడం మానేసి స్వీయ రక్షణలో పడ్డారంటే వైకాపా సర్కార్ వారి మీద ఎలాంటి గురి పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అక్కసుతోనే టీడీపీ జగన్ చేస్తున్న మంచి పనుల్ని అస్సలు గుర్తించలేకపోతున్నారు.
ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో లూప్ హోల్స్ వెతుకుతూ తిట్టిపోస్తుంటారు. మొన్నటికి మొన్న జగన్ 1088 అంబులెన్సులను స్టార్ట్ చేసి అత్యవసర వైద్య సేవలను ఎంతో పటిష్టపరిచారు. అలాగే కరోనా నియంత్రణలో కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. రోజువారీ టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచి దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ టీడీపీకి కోపంలో ఇవేమీ కనబడట్లేదు. అంబులెన్సులు ప్రారంభించే రోజున ఎంత తిన్నారు, ఎంత దోచుకున్నారు అన్నారే కానీ మంచి పని అని పొగడలేదు. అలాగే కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు వైకాపా తమకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుందో అలాంటి ట్రీట్మెంటే వైకాపాకు ఇస్తారనడంలో సందేహమే లేదు.
అసలు వైకాపా పని పట్టడానికైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు సీబీఎన్. ఈ తరహా రాజకీయాలను, ఆలోచనలనే శతృత్వ రాజకీయాలు అంటారు. ఈ రెండు పార్టీలు మనుగడలో ఉన్నన్ని రోజులూ శతృవులుగానే మిగిలిపోతారు. కానీ జనసేన పవన్ కళ్యాణ్ మాత్రం ఈ పద్దతికి చెక్ పెడుతున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు తప్ప శాశ్వత శత్రువులు ఉండరనేది పవన్ సిద్దాంతం. గతంలో కూడా అవినీతి, అన్యాయం చేస్తే నిలదీస్తాం, మంచి చేస్తే అభినందిస్తాం అన్న పవన్ అదే ధోరణి ఫాలో అవుతున్నారు. కరోనా కష్టకాలంలో వైఎస్ జగన్ అంబులెన్సులను ప్రారంభించడం మంచి విషయం, కరోనా విషయంలో కూడా ప్రభుత్వ పనితీరు బాగుంది అంటూ కితాబిచ్చారు.
గతంలో కూడా టెన్త్ పరీక్షల రద్దు విషయంలో కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పవన్ మంచి చేస్తే అభినందిస్తాం అనే మాట మీద నిలబడ్డారు. రాజకీయాల్లో ఆయనకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు లేరనడానికి, ఎవరినీ అయన శత్రువు అనే దృష్టితో చూడరని అర్థమైందని, ఇలాంటి ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఉన్న రాజకీయ నాయకులు, పార్టీలు ప్రస్తుత తరాలకు చాలా అవసరమని మెచ్చుకుంటున్నారు.