ఢిల్లీలో రఘురామరాజు రచ్చ.. వైకాపాకు ఇంతకంటే అవమానం ఉంటుందా 

Raghurama Krishnama Raju
గత కొన్నిరోజులుగా వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజుగారి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది.  సీఎం వైఎస్ జగన్ మీద అపారమైన గౌరవం ఉందంటూనే రఘురామరాజు ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలను తప్పుబడుతూ, అవినీతి జరుగుతోందని వేలెత్తి చూపుతున్నారు.  అంతేకాదు పార్టీలో కోటరీ నడుస్తోందని ఎద్దేవా చేశారు.  ఒకదశలో తానసలు జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదని, తన బొమ్మ మీదే నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు గెలిచారని మాట్లాడారు.  దీంతో సీరియస్ అయిన అధిష్టానం విజయసాయిరెడ్డి పేరు మీద ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 
 
ఈ నోటీసులు రఘురామరాజును చిక్కుల్లో పెడతాయని అనుకుంటే ఆ నోటీసులనే పాములుగా మార్చి వైకాపా మెడకు చుడుతున్నారు రఘురామరాజు.  ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న ఆయన తన వివాదానికి సంబంధించి చకచకా పావులు కదుపుతున్నారు.  తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీని అయితే తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి షోకాజ్ నోటీసులు అందాయని, ఆ నోటీసుల చెల్లుబాటు విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు.  అసలు పార్టీ పేరేమిటో తేల్చుకోవడానికే ఎన్నికల సంఘాన్ని కలిసినట్టు తెలిపారు.  ఒక పార్టీ నేత అదీ ఎంపీ స్థాయి నేత పార్టీ యొక్క అధికారిక నామం ఏమిటో కనుక్కోవడానికి ఢిల్లీ వెళ్లడం అనేది నిజంగా అధికార పార్టీకి పరాభవం లాంటిదే. 
 
ఇక తన రక్షణ విషయమై నిన్న రాత్రి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.  రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో కూడా చర్చించారు.  ఇన్నాళ్ళు ప్రతిపక్ష పార్టీ నేతలే రక్షణ కావాలని ఢిల్లీకి వెళ్లేవారు.  అలాంటిది అధికార పార్టీ నేతలే సొంత క్యాడర్, తోటి నేతల నుండి రక్షణ కోరుతూ వెళ్లి  ఢిల్లీలో కూర్చోవడం ప్రభుత్వానికి అవమానమే.  ఈ పరిస్థితులన్నింటి వెనుక వైకాపాకు సొంత వాదన ఉన్నా ప్రతిపక్షాలకు మాత్రం విమర్శలకు తావిచ్చినట్టు అవుతోంది.  ఇక సీఎంగారి మీద గౌరవంతో షోకాజ్ నోటీసులకు ఈ నెల 29న సమాధానం ఇస్తానని రఘురామరాజు తెలిపారు.  మరి ఆ సమాధానాలు అధికార పార్టీని ఇంకెన్ని చిక్కుల్లోకి నెడుతాయో మరి.