చంద్రబాబు కోర్టులను కూడా మేనేజ్ చేస్తున్నారట.. ఇదెక్కడి విడ్డూరం
వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడిపై రాజకీయ విమర్శలు చేస్తున్నామనే అపోహలో స్వచ్చంధంగా పనిచేసే వ్యవస్థల మీద కూడా విసురులు విసురుతున్నారు. ఏ రాజకీయ పార్టీ గురించి మాట్లాడినా, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి విమర్శ వచ్చినా దాని వెనుక చంద్రబాబు నాయుడి హాస్తం ఉందని అనేయడం వైసీపీ నేతలకు పరిపాటి అయిపోయింది. చివరకు చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని అది కూడ న్యాయ వ్యవస్థని మేనేజ్ చేస్తున్నారనే ధోరణిలో వైకాపా ఎంపీ నందిగం సురేష్ అనడం ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.
డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. విచారణ అనంతరం కోర్టు కేసును సీబీఐకి అపగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ వెంటనే సీబీఎన్ తన ట్విట్టర్ ఖాతాలో హైకోర్ట్ తీర్పును తాను స్వాగతిస్తున్నానని, సీబీఐ నిజాలను వెలికితీసి ప్రభుత్వం యొక్క కుట్రను, పోలీసుల అరాచకాన్ని బయటపెడుతుందని ఎప్పటిలానే తనదైన శైలిలో మాట్లాడారు. ఇదే వైసీపీ ఎంపీ నందిగం సురేష్ గారికి నచ్చలేదు. కేసు సీబీఐ చేతిలోకి వెళ్లడం మంచిదే అంటూనే అసలు కోర్టు తీర్పులు అంత త్వరగా చంద్రబాబుకు ఎలా తెలుస్తున్నాయి. ఆయన కాల్ డేటాను చెక్ చేయాలి. చంద్రబాబు వ్యవస్థలని, హైకోర్టును మేనేజ్ చేసుకుని తిరుగుతున్నారు అంటూ వింత ధోరణిలో మాట్లాడారు.
ఈ విమర్శలతో చంద్రబాబుకు కోర్టు తీర్పులు వెలువడటానికి ముందే ఫోన్ల ద్వారా తెలిసిపోతున్నాయనే అర్థం వచ్చేలా మాట్లాడారు ఆయన. వైకాపా ఎంపీగారు ఏకంగా న్యాయ వ్యవస్థ మీదనే అనుమానం వ్యక్తం చేసేలా మాట్లాడటం వెనుక బోలెడంత ఫ్రస్ట్రేట్ ఉంది. నిన్న ఒకరోజునే మూడు విషయాల్లో ప్రభుత్వం మీద హైకోర్ట్ అక్షింతలు వేసింది. వాటిలో మొదటిది సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడం కాగా రెండోది ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసే విషయమై వైకాపా సర్కార్ కొత్త జీవోను జారీ చేయగా అలా చేయడం కోర్టు దిక్కరణ చర్యని, జీవోను రద్దు చేసి దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అలాగే ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వరరావుపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశించింది. ఇలా ఒకేరోజు మూడుసార్లు హైకోర్టు షాకివ్వడం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. అదే అధికార పార్టీ నాయకులకు అంతులేని ఆగ్రహం తెప్పించినట్టుంది. ఆ కోపాన్ని వాళ్ళు తమ ప్రధాన టార్గెట్ చంద్రబాబు మీద విమర్శల రూపంలో చూపించారు. చూపిస్తే చూపించారు కానీ ఇలా సీబీఎన్ కోర్టులను కూడా మేనేజ్ చేస్తున్నారని అనడమే వింతగా ఉంది.