కూన మీద గట్టిగానే కన్నేసిన పోలీసులు
అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడినా చెల్లుతుంది. ఏ ప్రభుత్వ శాఖ మీద ప్రతాపం చూపినా, నోరు పారేసుకున్నా సేవ్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు. కానీ అధికారంలో లేనప్పుడు సైలెంట్ అవ్వాలి, రుబాబు తగ్గించాలి. అప్పుడే భద్రంగా ఉంటారు. కాదు కూడదని ఎప్పటిలాగే పేట్రేగి పోతే బ్రేకులు సడన్ బ్రేకులు పడక తప్పదు. ఈ ఫార్ములా టీడీపీ నేతల్లో కొందరికి అస్సలు అర్థం కావట్లేదు. తెలుగు దేశం నేత, మాజీ విప్ కూన రవికుమార్ పరిస్థితి ప్రజెంట్ ఇలానే ఉంది.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విప్ బాద్యతలు నిర్వర్తించిన కూన రవికుమార్ హడావుడి అప్పట్లో గట్టిగానే ఉండేది. అధికారులను ఆయన ఆటాడుకునేవారనే టాక్ ఉండేది. కానీ ఏ విషయాలు పెద్దగా బయటికి వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కూన చర్యలు బయటపడుతున్నాయి. పొందూరు తహసీల్దార్ రామకృష్ణను కూన దుర్భాషలాడి, లంచం ఆఫర్ చేసిన వాయిస్ క్లిప్స్ బాగా వైరల్ అయ్యాయి.
కొన్ని రోజుల క్రితం రామసాగరం చెరువులో మట్టి అక్రమ తవ్వకాల విషయంలో కూన సోదరుడికి చెందిన జెసీబీలు, టిప్పర్లను తహసీల్దార్ సీజ్ చేశారు. ఈ విషయంలో కలుగజేసుకున్న కూన రవికుమార్ నేరుగా తహసీల్దార్ కు ఫోన్ చేసి ఎంత లంచం కావాలో చెప్పు, వాహనాలు వదలకపోతే లంచం డిమాండ్ చేశావని కేసు పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా అప్పటికే కూన పరారయ్యారు.
అయితే ఈసారి కూన రవికుమార్ గతంలో బయటపడినంత ఈజీగా కేసు నుండి బయటపడలేరని రాజకీయ వర్గాల్లో టాక్ వినబడుతోంది. తహసీల్దార్ మాత్రమే కాక ఇంకొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూన మీద చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తుండటంతో ప్రభుత్వం, పోలీసులు తప్పకుండా గట్టి యాక్షన్ తీసుకునే ఆలోచనలోనే ఉన్నారట.