కరోనా వైరస్ నివారణ కోసం ఏపీ ప్రభుత్వం పలు విధానాలను అవలంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి జాగ్రత్తను ప్రభావవంతంగా పాటిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 11 లక్షలకు పైగా కరోనా నిర్దారణ పరీక్షలు చేసింది. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ మన్ననలు పొందుతోంది. ఇక కరోనా బాదితులకు చికిత్స అందించే విషయంలో కూడా భాద్యతగా వ్యవ్వహరిస్తున్న ప్రభుత్వం తాజాగా మరొక అడుగు ముందుకు వేసింది. అదే కరోనా కిట్ల పంపిణీ.
కరోనా ప్రాథమిక స్థాయిలో ఉన్నవారు చాలామంది ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో వైరస్ ఉన్న వ్యక్తవ్యక్తులు అవసరమైన మెడిసిన్స్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తోంది. అలా రావడం వలన వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం కరోనా కిట్ల పంపిణీ చేపట్టింది. ఎవరైన హోమ్ క్వారంటైన్లో ఉండి అధికారులకు సమాచారం అందిస్తే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి వారికి కరోనా కిట్ అందుతుంది. వైద్య సిబ్బదే నేరుగా ఆ కిట్ అందిస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కిట్లు అందుతాయి.
ఈ కిట్లలో శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, పారాసిటమాల్, యాంటీబయాటిక్స్, హైడ్రాక్సీక్లోరోక్విన్, విటమిన్ సి, డి, ఇ ట్యాబ్లెట్లు, పేషెంట్లు మందులు ఎలా వాడాలి, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి అనే అవగాహన పుస్తకం ఉంటాయి. వైరస్ ప్రాథమిక స్థాయిలో ఉన్నవారికి మాత్రమే ఈ కిట్లు ఉపయోపడతాయి. ఒకవేళ లక్షణాలు తీవ్రంగా ఉంటే బాధితులు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. ఇప్పటికే కరోనా పరీక్షల కోసం ఒక్కో జిల్లాకు నాలుగు బస్సులను కేటాయించింది. అంతేకాక కరోనా నియంత్రణ చర్యల కోసం ఒక్కో జిల్లాకు కోటి రూపాయల నిధులు ప్రకటించింది.