ఐపీఎల్–2022 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 8 జట్లతో పాటు అదనంగా మరో రెండు టీమ్‌లను కొత్తగా చేర్చనుంది. దీంతో మొత్తంగా 10 జట్లు ఈ మెగాటోర్నీలో టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ మేరకు గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఈ ఏడాది కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా క్యాష్ రిచ్ లీగ్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత మజా అందించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ మెగాటోర్నీలో ముంబై ఇండియన్స్ మరోసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక గత నెలలో ఐపీఎల్-2020కి శుభం కార్డు పడిన నాటి నుంచి వచ్చే సీజన్లో 10 జట్లను ఆడిస్తారంటూ ప్రచారం జరిగిన విషయం విదితమే.
అయితే వచ్చే ఏడాది ఐపీఎల్‌కు చాలా తక్కువ సమయం ఉండటంతో టెండరింగ్ ప్రక్రియ, మెగా వేలం నిర్వహించడం కష్టతరమని బీసీసీఐ పెద్దలు భావించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2022లో 10 జట్లు, 94 మ్యాచ్‌లతో బిగ్ టోర్నమెంట్ చూడవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.