ఎవ్వరినీ వదలోద్దు.. మీ వెనక నేనున్నానంటున్న జగన్ 

వైఎస్ జగన్ పాలనా పరంగా మంచి దూకుడు కనబరుస్తున్నారు.  ఏడాది పాలన ముగియడంతో వేగాన్ని మరింత పెంచారు.  ప్రధానంగా ఇసుక, మద్యం విషయంలో అక్రమాలకు అస్సలు తావివ్వకూడదని బలంగా సంకల్పించారు.  ఇటీవల ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలు సైతం ఇసుక విషయంలో విమర్శలు చేయడం, మాఫియా నడుస్తోందని, సామాన్యుడికి ఇసుక దొరకడం గగనమైందని అన్నారు.  దీంతో సీఎం ఇసుక విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు.  సామాన్యులకు ఇసుక సులభంగా దొరికే వెసులుబాటు కల్పించారు. 
 
రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్ లు తెరవాలని ఆదేశించిన ఆయన వర్షాకాలం మొదలయ్యేనాటికి 70 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉండాలని, క్రిష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, కడపలో ఇసుక ఉత్పత్తి పెరగాలని, రోజుకు 3 లక్షల టన్నుల ఉత్పత్తి జరగాలని ఆదేశించారు.  అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకోవచ్చని, అలాగే రీచ్ నుండి 5 కిలోమీటర్ల పరిధిలో గ్రామాల్లో సొంత అవసరాల కోసం ఎడ్లబండ్ల ద్వారా ఇసుక తీసుకెళ్లేవారు ఉచితంగా తీసుకెళ్లేలా ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఇలా పలు వెసుకుబాట్లు కల్పించడం వలన అక్రమాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.  అందుకే అక్రమాలకు పాల్పడేవారు ఎవరైనా సరే ఉపేక్షించవద్దు, దూకుడుగా వ్యవహరించండి, మీ వెనక నేనున్నా అంటూ సీఎం అధికారులకు భరోసా ఇచ్చారు.  మద్యం అక్రమాల విషయంలో కూడా అక్రమార్కులు ఎవ్వరినీ వదలోద్దని ఆదేశించారు.  మొత్తానికి సీఎం అక్రమాలకు, అవినీతికి ఎక్కువగా అవకాశం ఉన్న రెండు ప్రధాన విషయాల్లో అధికారులు నిర్భయంగా పనిచేయడానికి పూర్తి భరోసా ఇవ్వడం నిజంగా సంతోషించదగిన విషయం.  సీఎం ఇచ్చిన ధైర్యంతో అధికారులు సమర్థవంతంగా, పారదర్శకంగా పనిచేస్తే గొప్ప ఫలితాలు చూడొచ్చు.