తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ నెల కూడా సగం జీతమే వస్తుందా? లేక పూర్తి వేతనం వస్తుందా? అనే ఆందోళనలో ఉండగా మంత్రి హరీష్ రావు జూన్ నెల వేతనం ఉద్యోగులకు కోతల్లేకుండా మంజూరు చేయనున్నట్లు ప్రకటించడం బాగుంది. అయితే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అన్నిరాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లిస్తున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఉద్యోగుల స్థాయిని బట్టి 10 నుంచి 75 శాతం వరకు కోతలను విధించింది. మరి గడిచిన రెండు నెలలుగా ఉద్యోగులకు సగం జీతమే అందుతుండటంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇక జూన్ నుంచి వారికి ఎలాంటి కోతల్లేకుండా వేతనం చెల్లిస్తారు ఓకే.. మరి పాత బకాయిలకు సంబంధించిన మొతాన్ని జీపీఎఫ్‌లో జమ చేస్తారా ? ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన బకాయిలను కూడా జీపీఎఫ్‌లో కాకుండా నగదు రూపంలోనే ఇస్తేనే బాగుంటుంది. మరి కేసిఆర్ ప్రభుత్వం ఇస్తుందా ? లాక్ డౌన్ లో ఉద్యోగులు తమ జీతాల కోత పై కోర్టును ఆశ్రయించారు. దీని పై హైకోర్టు విచారణ చేపట్టి ఏ నిబంధనల ప్రకారం ఉద్యోగుల జీతాలు, పెన్షన్ లో కోత విధించాలో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ఆర్డినెన్స్ పై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు అందినా కేసీఆర్ మాత్రం పట్టించుకునే పరిస్థితులో లేడు.
ఏమైనా ఈ విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులకు జూన్ నుంచి పూర్తి జీతం అందుకుంటున్నా.. వారి గత బకాయిలను కూడా ప్రభుత్వం వారికి ఇస్తే బాగుంటుంది. మరి ఉద్యోగుల జీతాల పై ఇచ్చిన హామీ కేసిఆర్ ఏ మేరకు నిలబెట్టుకుంటారనేది వేచి చూడాల్సిందే.