హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌కు సహ యజమానిగా విజయ్‌

హైదరాబాద్‌: రూపే ప్రైమ్‌వాలీబాల్‌ లీగ్‌(పీవీఎల్‌)కు టాలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌, చెన్నై బ్లిట్జ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయ్‌ అభిమానులతో కలిసి సందడి చేశాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో వాలీబాల్‌ ఫ్యాన్స్‌ మస్తు ఎంజాయ్‌ చేశారు. హైదరాబాద్‌ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్న ఈ అర్జున్‌రెడ్డి స్టార్‌..బ్లాక్‌హాక్స్‌ జట్టుతో కలిసి కొనసాగడంపై స్పందించాడు.

‘నాకు వాలీబాల్‌, హైదరాబాద్‌ అంటే చాలా ఇష్టం. దేశంలోనే అత్యధిక మంది వీక్షించే లీగ్‌గా వాలీబాల్‌ నిలుస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కచ్చితంగా ఎంటైర్‌టైన్‌మెంట్‌కు చిరునామాగా నిలుస్తుంది. వాలీబాల్‌ అభిమానుల్లో చాలా మంచి ఆదరణ ఉంది. స్మార్ట్‌ బిజినెస్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి తోడు హైదరాబాద్‌ నగరంపై ప్రేమ, వాలీబాల్‌పై ఉన్న ఇష్టం ఇటు అడుగులు వేసేలా చేసింది.

వాలీబాల్‌ ఆట అంటేనే సూపర్‌ జోష్‌. కండ్లు చెదిరే స్మాష్‌లకు తోడు మెరుపు డైవింగ్‌లు ఈ ఆట ప్రత్యేకత. చాలా చురుకైన ఆట. ప్రతీ ఐదు నిమిషాలకోసారి మ్యాచ్‌ మలుపులు తిరుగుతూనే ఉంటాయి. నేను స్కూల్‌లో చదివే రోజుల్లో అటాకింగ్‌ను బాగా ఇష్టపడే వాళ్లం. ప్రపంచంలోనే చాలా మంది ఆకర్షించే ఆట. దీనికి తోడు రియల్లీ కూల్‌ గేమ్‌ అనొచ్చు’ అని విజయ్‌ అన్నాడు.

మరోవైపు ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ భవిష్యత్‌పై స్పందిస్తూ ‘ ప్రపంచంలోనే అత్యుత్తమ వాలీబాల్‌ లీగ్‌గా ఇది నిలుస్తుంది. ముఖ్యంగా ప్రేక్షక ఆదరణ, ప్లేయర్ల ద్రుష్టిలో పీవీఎల్‌కు మెరుగైన భవిష్యత్‌ ఉంది’ అని విజయ్‌ పేర్కొన్నాడు.