మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించారు. ఈ మూవీ జూలై 14న రిలీజ్ అయింది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పేందుకు చిత్రయూనిట్ థాంక్యూ మీట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో
సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘నేను మామూలుగా చకచకా పరిగెత్తేలా స్క్రిప్ట్ రాస్తాను. కానీ ఈ బేబీ కథ రాస్తున్నప్పుడు మాత్రం ఈ కథని, పాత్రలని మెల్లిగానే చూపించాలని అనుకున్నా. ఇలా స్లో నెరేషన్‌తో సినిమా తీస్తే ఆడుతుందో లేదో అని అనుకున్నాను. కానీ ప్రేక్షకులు మాత్రం ప్రతీ సీన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తిట్టే వాళ్లు తిడుతున్నారు.. పొగిడే వాళ్లు పొగుడుతున్నారు.. నేను అన్నింటినీ స్వీకరిస్తాను. ఇరవై ఏళ్ల క్రితం నేను ప్రేమించాను. ఓ ఎనిమిది నెలలు నేను నరకం అనుభవించాను. ఆ బాధను తెలియజేయాలని ఈ కథ రాసుకున్నాను. నేను వైష్ణవి కోణంలో కథ రాయలేదు. ఆనంద్ కోణంలోంచి కథ రాసుకున్నాను. నా తొలిప్రేమ సక్సెస్ అయింది. కానీ ఆ బాధ మాత్రం నాకు తెలుసు. ఆ బాధ ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను. మున్ముందు నేను సినిమాలు నిర్మిస్తాను. దర్శకత్వం వహిస్తాను. నెక్ట్స్ మళ్లీ మా ఎస్ కే ఎన్‌తోనే చేస్తున్నాను. ఈ మూడు పాత్రలు రాయడానికి నేను ఎంతో స్ట్రగుల్ అయ్యాను. ఎవరి కోణంలో ఆలోచించి రాయాలి.. ఎలా తీయాలని ఎంతో మథన పడ్డాను. ఇక టైటిల్ విషయంలోనూ ఎంతో ఆలోచించాను. నా సినిమాలకు క్యాచీ టైటిల్ ఉండాలని భావిస్తాను. అలాంటి క్రమంలో బేబీ అని పెట్టాలని అనుకున్నాను. దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో మార్పులు కూడా చేశాను. ప్రేమ వల్లే వచ్చే సంతోషం కన్నా బాధే చాలా ప్రభావం చూపిస్తుంది.. గట్టిగా ఉంటుంది. ప్రేమంటే నిర్వచించడం కష్టం. ప్రేమ వల్ల ఎందుకు బాధ వస్తుందంటే చెప్పలేం. బూతులు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. నేను ఇలా రా గా ఉండాలనే తీశాను. సెన్సార్ వల్ల ఇంకా చాలా కట్ అయ్యాయి. కానీ నాకు ఇది తప్పలేదు. అలాంటి పదాలు పెట్టినందుకు ఓ పది టికెట్లు తెగుతాయని మాత్రం కాదు’ అని అన్నారు.
నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మీడియాకు థాంక్స్. మీడియాలో నా స్నేహితులకు నచ్చితే చాలని అనుకున్నాను. అందరూ అద్భుతంగా ఉందని, మంచి సినిమా తీశావని అన్నారు. సినిమాను చూసి ప్రేక్షకులు ఏడుస్తూ బయటకు వచ్చారు.. బయ్యర్లంతా నవ్వుతూ వచ్చారు.. అంటే నా సినిమా సక్సెస్ అయిందని అర్థమైంది. ప్రసాద్ ఐమాక్స్‌లో ప్రీమియర్ పడ్డాక సినిమా సక్సెస్ అయిందని తెలిసిందే. అందుకే నేను దాన్ని టెంపుల్‌లా భావించి.. నేలను మొక్కాను. ఎన్నో కష్టాలు పడి సినిమాను తీశాం. నిడివి ఎక్కువగా ఉందని అనుకున్నాం. మంచి సినిమా తీశామని తెలుసు. ఆడియెన్స్ ఇందులో లెంగ్త్‌ను చూడలేదు.. స్ట్రెంత్‌ను చూశారు. ఈ సినిమా ఇంకో అరగంట కట్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యేది. పాత్రల భావోద్వేగాలు అర్థం కావాలని, అర్థం అయ్యేలా చెప్పాలనే సాయి రాజేష్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. బేబీ నిర్మాతగా నేను గర్వపడుతున్నాను. ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన నా స్నేహితుడు సాయి రాజేష్‌కు థాంక్స్. ఇప్పుడు నా ఫ్రెండ్‌ని రారా పోరా అని కూడా పిలవలేకపోతోన్నా. నాకు గౌరవం పెరిగింది. మనల్ని నమ్మి ఆనంద్, వైష్ణవి, విరాజ్‌లు ఈ సినిమాకు కమిట్ అయ్యారు. మరో చిత్రాన్ని చేయకుండా ఉండిపోయారు. వైష్ణవిని అందరూ తిడుతున్నారు. అంటే ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థం అవుతుంది. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తి. సినిమాకు ఎంత పెట్టారు.. విజువల్స్ అంత బాగున్నాయ్ అని అడుగుతున్నారు. అది బాల్ రెడ్డి గారి కెమెరా గొప్పదనం. ఈ సినిమాకు టీం అంతా కష్టపడి పని చేసింది. సాయి రాజేష్‌ది, నాది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కదా? అని వెంటనే సినిమాను చేయం. మంచి కథ సెట్ అయినప్పుడే తీస్తాం. ప్రస్తుతం బేబీ సక్సెస్ మూడ్‌లో ఉన్నాం. మూడేళ్లు కష్టపడి సినిమాను చేశాం. లాస్ట్ పదిహేను రోజులు నిద్రాహారాలు మానేసి పని చేశాం. నిన్న రాత్రి సంతృప్తిగా భోజనం చేసి పడుకున్నాం. మెజార్టీ ఆడియెన్స్‌కు సినిమా నచ్చితే సక్సెస్ అవుతుంది. అలా మా బేబీ సినిమా సక్సెస్ అయింది. మా ఈ విజయం అందరిది. ఏ ఒక్కరిదో కాదు’ అని అన్నారు.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘పెద్ద స్క్రీన్‌కు మేం కొత్త. మేం జనాలకు ఇంకా అలవాటు కాలేదు. చిన్న సినిమాల్లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా బేబీ నిలిచిందని విన్నాను. ఇంత మంచి విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్. సంథ్య థియేటర్లో మొదటి సారిగా సినిమాను చూశాను. రియాక్షన్ ఎలా ఉంటుందా? అని చూశాను. ప్రతీ సీన్‌కు వేరే లెవెల్లో రియాక్షన్స్ ఇచ్చారు. బేబీ అనేది రియాల్టీ అండ్ బోల్డ్ కంటెంట్. ఇలాంటివి ఎంతో మంది జీవితాల్లో జరిగి ఉంటాయి. ఈ కథ, పాత్ర విన్నప్పుడు నాకు భయం వేయలేదు. ఎగ్జైటింగ్‌గా అనిపించింది. మేం ఎంతగా నటించినా కూడా సాయి రాజేష్ అన్న రైటింగ్ వల్లే అదంతా సాధమ్యైంది. ఇంత మంచి పాత్రను, ఇంత మంచి సినిమాను ఇచ్చిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. మమ్మల్ని నమ్మి సినిమాను తీసిన ఎస్ కే ఎన్ అన్న, ధీరజ్ అన్నకి థాంక్స్. విజయ్ అన్న తన మ్యూజిక్‌తో అదరగొట్టేశారు. ఆయన మీద అంచనాలు పెరిగాయి. బాల్ రెడ్డి అన్న కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. ఇంతగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘జూలై 14న మా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎంతో ఆనందంగా ఉన్నాం. ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ప్రతీ డైలాగ్‌కు ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. అరుపులు, విజిల్స్, క్లాప్స్ కొడుతుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. నేను ఫ్యూచర్ సినిమాల గురించి, నా పాత్ర గురించి ఎక్కువగా ఆలోచించలేదు. బేబీ అనేది నా మొదటి సినిమా. దాని కోసం ప్రాణం పెట్టి చేశాను. బేబీ సినిమాలో నేను చేసిన పాత్రను పోషించడం అంత సులభం కాదు. కొంచెం మీటర్ తప్పినా.. మీనింగ్ తప్పైపోతుంది. డైరెక్టర్ చెప్పిన మీటర్ నాకు చాలా నచ్చింది. సాయి రాజేష్ అన్న అద్భుతంగా పాత్రను డిజైన్ చేశారు. ఇంత బాగా నటించగలవా? అని నా ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోయారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ.. ‘నా మూవీకి హౌస్ ఫుల్ ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నాను. ఈ బేబీతో నా కోరిక తీరింది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని అన్నారు.
కెమెరామెన్ బాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతకు థాంక్స్. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. ‘మా దర్శకుడికి ప్రసాద్ ఐమాక్స్‌లో ప్రీమియర్స్ వేస్తే బాగుంటుందని సెంటిమెంట్ ఉంది. ఒక స్క్రీన్ అని మొదలుపెడితే.. నాలుగు స్క్రీన్లు అయ్యాయి. డిమాండ్ వల్ల పెయిడ్ ప్రీమియర్లు పెంచాం. అన్ని ఏరియాల్లో కలిపి 100 ప్రీమియర్ షోలు వేశాం. అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రీమియర్ షోలు చూసి చాలా మంది ఏడ్చారు. ఇంత మంచి సినిమాను తీసిన దర్శకుడు సాయి రాజేష్ గారికి థాంక్స్. రైటింగ్, మేకింగ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. జనాలకు అదే నచ్చింది. ప్రతీ సినిమాకు ఇలాంటి సక్సెస్ రాదు. కల్ట్ క్లాసిక్ అంటున్నారు. పదేళ్లకు ఒకసారి ఇలాంటి సినిమాలు వస్తాయి. కలెక్షన్లు చూసి మాకే షాకింగ్‌గా అనిపించింద’ని అన్నారు.
విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘బేబీ సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. ఈ విజయాన్ని చూస్తే ఎంతో ఆనందంగా, సంతృప్తిగా ఉంది. మా సినిమాను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. అరవింద్ గారు, మారుతి గారు, విజయ్ గారు ఇలా చాలా మంది బేబీని సపోర్ట్ చేశారు. ఈ రోజు ఇలాంటి సక్సెస్ కోసం మా టీం అంతా కష్టపడింద’ని అన్నారు.