వసుధైక ఫౌండేషన్ ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య స్ఫూర్తితో .. వసుధైక ఫౌండేషన్ ” ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ” ధ్యానయోగం – II రామలక్ష్మణుల ఆధ్యాత్మిక గురు సమ్మేళనం కార్యక్రమం వైభవంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీ సదానంద గిరి గురూజీ, శ్రీ ప్రభాకర్ గురూజీ, శ్రీ బోలేనాథ్ గురూజీ, శ్రీ లక్షణానంద గురూజీ, శ్రీ బిక్షమయ్య గురూజీ, సూర్య నారాయణ గురూజీ పాల్గొని.. తమ దివ్య ప్రవచాన్ని అందించారు. అలాగే చిత్ర పరిశ్రమ నుంచి రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి, నటుడు రాజారవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక ప్రముఖులని రామలక్ష్మణులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రంలో తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక గురువులందరికీ పాదాభివందనం. వసుధైక ఫౌండేషన్ నాగేంద్ర గారికి అభినందలు. పత్రీజీ గారితో నాకు అనుబంధం వుంది. ఒక రోజు సాక్షాత్కారంగా మా ఇంటికి వచ్చారు. ఆయన కాళ్ళకి దండం పెట్టాను. ఆయన కూడా నా కాళ్ళకి దండం పెట్టారు. ఇదేంటని అడిగితే.. ‘నువ్వే అన్నావ్ కదా నాలో శివుడు కలడు అని.నాలో శివుడు వుంటే నీలోనూ ఉంటాడు’’ అని సమాధానం ఇచ్చారు. ఎదిగిన కొద్ది ఒదగడం అంటే ఇదే. ఆయన మా ఇంట్లో వేణు గానం చేశారు. ఆయనలో కృష్ణతత్మం వుంది. ధ్యానం.. అంటే బుద్ధి యొక్క ప్రయాణం. కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను బయటికి తీసి పడేయాలి. ధ్యానం మనకోసమే కాదు ప్రపంచం కోసం. వసుధైక కుటుంబం కోసం’’ అన్నారు.
రాజారవీంద్ర మాట్లాడుతూ.. రామలక్ష్మణులతో నాకు ఎంతో అనుబంధం వుంది. షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరికితే మేము రమణ మహర్షి గారి గురించి మాట్లాడుతుంటాం. కోరికలు అనే చెట్టుని మనమే పట్టుకొని అవి పోవాలని ధ్యానాలు చేస్తుంటాం. ముందు ఆ కోరికలు చెట్టుని వదిలేస్తే మనం ప్రశాంతంగా వుంటాం. మనం నిద్రపోయిన మనలో ఒకటి మెలకువలో వుంది. స్వప్నంలోనిది కూడా నిజం అనిపిస్తుంది. మనం స్పృహలో లేనప్పుడు కూడా ఒకటి మెలకువగా వుంటుంది. దాన్ని ఆత్మ అనొచ్చు. రమణ మహర్షి గారు దాన్ని అసలు నేను అన్నారు. నిద్రలో హాయిగా వున్న మనకి మెలకువలో ఎందుకు ఇన్ని గొడవలు..? దినికి మహర్షి.. మొదట ఆలోచనని తీసేయండని చెప్పారు. మనం మెలకువలోకి రాగానే ఈ దేహం నాది అనే ఆలోచన మొదలౌతుంది. నాది అనే ఆలోచనతో ఏది చేసిన లాభం లేదు. మనం తెలుసుకోవాల్సింది మనలోనే వుందనే మహర్షి మాటలు మనల్ని మనం తెలుసుకోవడంలో సహాయపడతాయి’’ అన్నారు
రామలక్ష్మణులు మాట్లాడుతూ.. ఈ కార్యకరమానికి విచ్చేసిన ఆధ్యాత్మిక గురువులు, ప్రముఖులు, ఆత్మ బంధవులు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కారణం.. వసుధైక ఫౌండేషన్. నాగేంద్ర గారు ఈ కార్యక్రమానికి వెన్నుముకలా వుండి అద్భుతంగా ముందుకు నడిపారు. వారికి ధన్యవాదాలు. వసుధైక ఫౌండేషన్ కి మా తరపున వారికి లక్ష రూపాయిల విరాళం ఇస్తున్నాం. వారి అద్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు.
నాగేంద్ర మాట్లాడుతూ.. బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి లక్ష్య సాధన వైపు వసుధైక ఫౌండేషన్ అడుగులు వేస్తోంది. ఈ ఏడాదిలో ఎన్నో మరపురాని పనులని, విజయాలని అందుకుంది. ఇది ఫౌండేషన్ సమిష్టి కృషితో సాధ్యమైయింది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం అవ్వడానికి కారణమైన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు’’ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రముఖులు శ్రీమతి పరిణితీ పత్రిజీ, శ్రీ విజయ్ భాస్కర్ రెడ్డి, మారం శివ ప్రసాద్, విక్రమాదిత్య, రాంబాబు, వసుధైక ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.