Bhavayaami Book: అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగిన భావయామి పుస్తక ఆవిష్కరణ !!!

సీతాయణం చిత్ర దర్శకుడు ప్రభాకర్ ఆరిపాక రచించిన కథల సంపుటి భావయామి పుస్తక ఆవిష్కరణోత్సవం హైదరాబాద్ ప్రసాద్ ఫిలిం ల్యాబ్ లో ఘనంగా జరిగింది. దర్శకుడు వైవిఎస్ చౌదరి, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ నటులు అజయ్ ఘోష్, గుండు సుదర్శన్, గేయ రచయిత సురేంద్ర కృష్ణ, డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మ, ప్రముఖ కధా రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు, సీనియర్ నిర్మాత వేమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆవిష్కరణ సభకు ప్రముఖ నటుడు, రచయిత డా. తనికెళ్ల భరణి ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ… ఒకప్పుడు రచయితలు తమ పుస్తకం తామే రాసుకుని వాళ్లే ప్రింట్ చేసుకుని వాళ్లే అమ్ముకునే స్థితి నుంచి ఈరోజు పుస్తకం సింహాసనంపై కూర్చుని రచయిత గర్వపడే విధంగా పాఠకుల ముందుకు పుస్తకాన్ని తీసుకొచ్చిన ఘనత పబ్లికేషన్ సంస్థలదేనన్నారు. ఇలాంటి అద్భుతాలు అన్విక్షికి వంటి సంస్థలు రావడం వల్లే సాధ్యమైందన్నారు. పాఠకులు, రచయితలు ఇటీవల కాలం లో బాగా పెరిగారని కొత్త రచయితల రాక వలన లక్షల్లో పుస్తకాలు అమ్ముడుపోయే విధంగా అద్భుతాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పుడే విడుదలైన భావయామి పుస్తకం లో మంచి కథలు ఉన్నాయని రచయితను అభినందించారు.

దర్శకుడు వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ… పుస్తకం రాసి ఆవిష్కరణ చేసిన రచయిత ప్రభాకర్ చేసిన సాహసం చాలా గొప్పదన్నారు. ఒక్కో రచయిత కు ఒక్కో శైలి ఉంటుందని ప్రపంచంలో ఎవరికి ఎవరూ పోటీ కాదని ఎవరి వైవిధ్యం వారిదే అన్నారు. రచయిత అయితే రాస్తూ ఉండాలని దర్శకుడు అయితే తీస్తూ ఉండాలని త్వరలో ప్రభాకర్ దర్శకుడుగా సక్సెస్ సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఆన్లైన్ లో పుస్తకాన్ని కొనుక్కోవడానికి అమెజాన్ సేల్స్ వైవిఎస్ చౌదరి గారు ఆవిష్కరించారు.

నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ… పుస్తకాలు మన ఆలోచనలకు మరో లోకానికి తీసుకెళ్తాయని అలాంటి పుస్తకాలు చదవడం వలనే తన ఆలోచన ధోరణి మారిందని అన్నారు. సమాజాన్ని పరిశీలించకుండా.. ప్రకృతిని అర్థం చేసుకోకుండా.. మనిషిని చదవకుండా.. ఎవరూ రచయిత దర్శకులు నటులు కాలేరని చెప్పారు. రచయిత ప్రభాకర్ ఆరిపాకతో గడిపిన కాలం ఒక పుస్తకం తో మాట్లాడినట్లు ఉంటుందన్నారు. అన్ని అంశాలపై పరిపూర్ణ అవగాహన కలిగిన ఈ రచయిత అలాంటి కథలనే మనకందించాడని చెప్పారు.

నటుడు గుండు సుదర్శన్ మాట్లాడుతూ… మనలో పుట్టి మనదైన కధలైతే పాఠకుల మది లో పది కాలాలపాటు పదిలంగా ఉంటాయని అలాంటి కోవలోనే ప్రభాకర్ రాసిన భావయామి లోని ప్రతి కధ లోను ఉంటాయన్నారు. అన్విక్షికి వారు ప్రచురించిన పుస్తకాల్లో ఒక స్టాండర్డ్ ఉంటుందని వారు అందించిన ప్రతి పుస్తకం కొనుక్కోవాలి అనిపించేలా ఉంటుందని ఆయన అన్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ ప్రభాకర్ రాసిన కథలు విభిన్న శైలి తో ప్రతి ఒక్క పాఠకుడికి అలరిస్తాయన్నారు. ఆయన కలల నుండి మరిన్ని మంచి కథలు రావాలని ఆకాంక్షించారు పుస్తకాన్ని విడుదల చేసిన అన్విక్షికి వారిని ఈ సందర్భంగా అభినందించారు.

ఈ పుస్తకావిష్కరణ సభలో రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు సీనియర్ నిర్మాత వేమూరి సత్యనారాయణ పాటల రచయిత సురేంద్ర కృష్ణ దర్శకుడు భరత్ కమ్మ, ఆర్ట్ డైరెక్టర్ డౌలూరి నారాయణ, రచయిత ప్రభాకర్ ఆరిపాక అన్విక్షికి పబ్లికేషన్స్ మహి బెజవాడ, వెంకట సిద్ధారెడ్డి, శివ మల్లాల, ప్రముఖ ఏంకర్ అంజలి తదితరులు పాల్గొన్న ఈ సభకు కృష్ణవేణి శఠకోపన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

విజయసాయికి జగన్ చావుదెబ్బ || Analyst Ks Prasad EXPOSED Vijaya Sai Reddy Video Leak || Telugu Rajyam