‘త్రిబుల్ ఆర్’ చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ అకాడమీ అవార్డ్ వచ్చింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ అవార్డు ‘నాటు నాటు’ సాంగ్ కి ఇస్తున్నట్టుగా ఆస్కార్ వేదిక మీద ప్రకటించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా దర్శకుడు రాజమౌళి కాగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ ఈ ‘నాటు నాటు’ పాటని రాశారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కోరియోగ్రఫీ చేశారు. గత కొన్ని వారాలుగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చింది.అనేక ప్రశంసలు పొందింది. హాలీవుడ్ అభిమానుల హృదయాలు దోచుకుంది. అవన్నీ ఒకెత్తయితే ఇది ఒక్కటీ మరో ఎత్తు.. 130 కోట్ల మంది గర్వించేలా తెలుగోడు తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. మన ‘నాటు నాటు’ పాటకి పట్టం కడుతూ అకాడమీ అవార్డ్స్ సంస్థ ఆస్కార్ అవార్డు ప్రకటించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. ది అవార్డ్ గోస్ టు ‘నాటు నాటు’ అని చెప్పగానే అక్కడ ఉన్న రాజమౌళి, కీరవాణి, రాంచరణ్, ఎన్టీఆర్ సంబరాల్లో మునిగిపోయారు. అసలు తెలుగు సినిమా ఆస్కార్ వరకు చేరుకోవడం సాధ్యమేనా అనే పరిస్థితి నుంచి ఆస్కార్స్ కి నామినేట్ కావడం మాత్రమే కాదు అవార్డు గెలిచి చూపించారు. టాప్ గన్ మేవరిక్ చిత్రం నుంచి ‘హోల్డ్ మై హ్యాండ్’..టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ చిత్రం నుంచి ‘అప్లాజ్’.. ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ అల్ ఎట్ వన్స్ చిత్రం నుంచి ‘థిస్ ఈజ్ ఏ లైఫ్’ .. బ్లాక్ పాంథర్ వాకండా ఫారెవర్ చిత్రం నుంచి ‘లిఫ్ట్ మీ అప్’ పాటలు నాటు నాటు సాంగ్ కి పోటీగా నిలిచాయి. వీటిని అధికమిస్తూ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి వేదికపై అవార్డు అందుకున్నారు. నాటు నాటు సాంగ్ మొదట లిరికల్ వీడియో విడుదలైనప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది.
జపాన్, చైనా, అమెరికా , ఇంగ్లాండ్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సైతం ఫిదా అవుతూ ఈ పాటకి మ్యూజిక్ రీల్స్ చేశారు. ఈ పాట ఆస్కార్ అవార్డు సాధించింది అంటే రాజమౌళి, కీరవాణి తో పాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, లిరిక్స్ అందించిన చంద్రబోస్, గాత్రం అందించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గురించి కూడా చెప్పాలి. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అందించిన హుక్ స్టెప్ ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావడానికి కారణం అని చెప్పాలి. ఇక రాంచరణ్, ఎన్టీఆర్ ని ఎంత ప్రశంసించినా తక్కువే. ఇద్దరూ తమ డ్యాన్స్ మూమెంట్స్ లో చిన్న తేడా కూడా లేకుండా పర్ఫెక్ట్ సింక్ తో డ్యాన్స్ చేశారు. ఆర్ఆర్ ఆర్ చిత్రానికి అంతర్జాతీయంగా వస్తున్న రెస్పాన్స్ గమనించిన జక్కన్న రాజమౌళి.. ఈ చిత్రానికి ఆస్కార్ సాధించే సత్తా ఉందని గట్టిగా నమ్మారు. ఇండియా తరఫున ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్స్ కి షార్ట్ లిస్ట్ కాలేదు. అయినా రాజమౌళి నిరాశ పడలేదు. తనవంతు ప్రయత్నాలు గట్టిగా చేశారు. ఫలితంగా ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ కి ఎంపిక కావడం మాత్రమే కాదు.. అవార్డు గెలిచి చరిత్ర సృష్టించింది. ఇలా తెలుగు పాట ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటం, ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటి సారి. ఇప్పుడు ఈ పాట చరిత్ర సృష్టించింది. ఇది తెలుగువాడి విజయం, తెలుగువాడికి గర్వకారణం. మన తెలుగు పాట ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించడంతో తెలుగునేల పులకించింది. మొదటి సారిగా ఓ తెలుగు పాట ఇలా ఆస్కార్ గెలుచుకోవటం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత దేశానికి చెందిన వారు ఎంతమంది ఆస్కార్ గెలుచుకున్నారు అంటే వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటిది ఒక తెలుగు సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ లోని ఈ పాటకి ఆస్కార్ రావటం భారత దేశానికే గర్వ కారణం. దర్శకుడు రాజమౌళి భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు.
మార్చి 24, 2022 ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి సంచలమం సృష్టించింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించారు, ఈ పాటకి ఈ ఇద్దరు నటులు అద్భుతమయిన డాన్స్ చేశారు. ఈ ఇద్దరు నటులు ప్రస్తుతం అమెరికాలో వుండి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి విపరీతమయిన ప్రచారం చేశారు. అక్కడ టాక్ షో, రేడియో లో ఇద్దరు నటులు ఇంటర్వూస్ ఇచ్చారు. తమ సినిమాకి ప్రచారం చేశారు. దర్శకుడు రాజమౌళి అయితే అమెరికా లో చాలా కాలం వుండి, ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాని ప్రమోట్ చేశారు. స్టీవెన్ స్పెల్ బెర్గ్, క్రిస్టోఫర్ నోలన్, జేమ్స్ కామెరాన్ లాంటి పెద్ద పెద్ద దర్శకులని కలిసి వాళ్ళకి సినిమా చూపించి, వాళ్ళచేత ఎంతగానో ప్రశంసలు పొందారు. ప్రపంచం లో పేరెన్నికగన్న అంతటి పెద్ద దర్శకులు మన తెలుగు సినిమా గురించి మాట్లాడటమే ఒక అద్భుతం. అటువంటి దర్శకులు రాజమౌళి గురించి, ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అలాంటి సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఈరోజు ఆస్కార్ లో ఉండటమే చరిత్ర, మరి అలాంటిది ఆస్కార్ గెలుచుకుంది అంటే, అది చరిత్ర కన్నా గొప్పది. అందులోకి తెలుగు సినిమా ఈరోజు ఇంతటి స్థాయికి చేరింది అంటే, ప్రతి తెలుగు వాడు, భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈరోజు. హేట్సాఫ్ టు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మిగతా టీం సభ్యులు అందరికీ.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఆస్కార్స్ సందడి
మన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరూ ఆస్కార్స్ లో అదిరేటి డ్రెస్సులతో ఆకట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరూ ఈ సారి ఆస్కార్స్ అవార్డు ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు. ఇద్దరూ ఆస్కార్ ఫంక్షన్ లో బాగా సందడి చేసి మనవాళ్లందరినీ విశేషంగా ఆకర్షించారు. ప్రతీ ఒక్కరి కళ్ళు ఈ ఇద్దరి హీరోల పైనే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రెడ్ కార్పెట్ మీద నడిచినప్పుడు బ్లాక్ టాప్ వేసుకొని దాని మీద టైగర్ బొమ్మ కూడా ఉండటం అందరికీ ఆసక్తికరం గా అనిపించింది. అలాగే రామ్ చరణ్తో పాటు తన భార్య ఉపాసన కూడా వచ్చారు. రామ్ చరణ్ కూడా బ్లాక్ డ్రెస్ లో మురిసిపోయారు. అలాగే రామ్ చరణ్, బాలీవుడ్ నటి దీపికా పడుకొనే తో కూడా కెమెరా వాల్లకి పోజు లు ఇచ్చారు. అట్టహాసంగా మొదలైన ‘ఆస్కార్’ పండుగలో ‘నాటు నాటు’ డ్యాన్స్‌తో డాల్బీ థియేటర్ దద్దరిల్లిపోయింది. ప్రపంచ సినిమా పండుగ అట్టహాసంగా మొదలైంది. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఐదు గంటలకు వేడుక ప్రారంభం అయింది. కోట్లాది మంది తెలుగు ప్రజల ఆస్కార్ కలలను నిజం చేస్తూ అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్’సత్తా చాటింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీ పడి ‘నాటు నాటు’పాటను ఆస్కార్ వరించింది. దర్శకుడు రాజమౌళి,ఎన్టీఆర్, రామ్‌చరణ్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడిపారు. ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’పాటకు హాలీవుడ్ డ్యాన్సర్లు చిందులేసి ఉర్రూతలూగించారు. ఈ పాట ప్రదర్శించిన సందర్భంలో కేరింతలతో ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ జరుగుతున్న డాల్బీ థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది.
ఇదిలా ఉండగా.. ఆస్కార్ వేడుకకు హాజరయ్యే ముందు రామ్‌చరణ్ అభిమానులను కలిశారు. అమెరికాలోని మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. వారితో చరణ్ ఆత్మీయంగా ముచ్చటించి, సెల్ఫీలు దిగారు. ‘నన్ను కలవడానికి అమెరికాలో ఎక్కడెక్కడి నుంచో కష్టపడి మరీ ఇంతదూరం వచ్చారు. మీ ప్రేమ, అభిమానం గురించి ఎంత చెప్పినా తక్కువే. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటాను’ అని చరణ్ ఉద్వేగంగా చెప్పారు. ఎన్టీఆర్ కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడిపారు.‘నాటు నాటు పాట’ కోసం చిత్రబృందం పడిన కష్టాన్ని ఆయన మీడియాతో పంచుకున్నారు. ‘స్నేహం గొప్పదనాన్ని సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’’ అని ఎన్టీఆర్ అన్నారు. ‘నాటు నాటు’ పాట కోసం చరణ్‌తో కలసి కొన్ని రోజులపాటు ప్రాక్టీస్ చేసినట్లు చెప్పారు. ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌లో భాగమవ్వడం కంటే గొప్ప ఆనందం ఇంకేం ఉండదు అన్నారు.
హాలీవుడ్ నటుడు బ్రెండెన్ ఫ్రాజర్‌తో ఎన్టీఆర్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు పాట ‘నాటు నాటు’ చరిత్ర సృష్టించింది. అవార్డు ప్రకటించకముందే, మొదటి సారిగా ఒక తెలుగు పాటను ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో లైవ్ గా చూపించటం మరపురాని దృశ్యం. ఈ ఘనత ప్రతి తెలుగు వాడు, భారత దేశం గర్వించదగ్గ విషయం. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, ఈ పాటని రాసిన చంద్రబోస్, ఇంకా పాడిన వారు, కోరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ ఇంకా ఎంతోమంది కృషి ఈ పాట వెనకాల వుంది. అటువంటి ఈ తెలుగు పాటని మొదటి సారిగా ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో లైవ్ గా చూపించటం, ఆ పాట అయ్యాక, మొత్తం అక్కడకి వచ్చిన హాలీవుడ్ నటీనటులు, సాంకేంతిక నిపుణులు అందరూ లేచి నిలిచిని ఈ పాటలకి చప్పట్లతో తమ హర్షం వ్యక్తం చేశారు. అంటే అక్కడి వారందరికీ కూడా ఈ పాట ఎంతలా ఆకట్టుకుందో తెలుస్తోంది. భారతీయ నటి, దీపికా పడుకొనె ఈ పాట కి ఇంట్రొడక్షన్ ఇచ్చి, పాటకోసం కొంత చెప్పారు. నాటు అంటే ఏంటో కూడా తెలుసుకోండి అని చెప్పారు. ఈ పాట లైవ్ అనగానే మొత్తం హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ప్లే బ్యాక్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కల భైరవ ఈ పాటని లైవ్ లో పాడి అందర్నీ ఆనందపారవశ్యంలో ముంచెత్తారు.