ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జమున సంతాప సభ

అలనాటి అందాల నటి ప్రజానాట్యమండలి బిడ్డ జమున సంతాప సభ సోమవారం ఉదయం నిర్మాతల మండలి హలులో జరిగింది. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎంతో మంది ప్రజా కళాకారులను ఉన్నత శిఖరాలకు చేర్చిన ప్రజానాట్యమండలి, చిన్న వయసులోనే బుర్రకధ నాజర్ తదితరులు జమున ని నాటకాలలో నటింపజేసిన పిదప డాక్టర్ గరికపాటి రాజారావు దర్శకత్వంలో నిర్మించిన పుట్టిల్లు చిత్రం ద్వారా సినిమా రంగానికి పరిచయం చేయటం ద్వారా ఆవిడ ఉన్నతికి అండగా నిలబడటం, తదుపరి జమున కూడా ప్రజానాట్యమండలి అనేక సభలకు హాజరయి నూతన కళాకారులను ఉత్సాహ పరచటం జరిగింది. ఆవిడ మరణం ప్రజానాట్యమండలికి తీవ్రమైన లోటు అని అన్నారు.

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ నేను ఇష్టపడే ఇద్దరు అగ్ర నటులతో పోటీ పడుతూ సినిమా పరిశ్రమలో నటించటం జమున గారికే చెల్లిందని, దానికి కారణం ఆవిడ ప్రజానాట్యమండలి ప్రధాన కారణం అని నేను బలంగా నమ్ముతున్నాను అన్నారు. ప్రజానాట్యమండలికి చెందిన అన్న నల్లూరి గారితో సంబంధం కలిగిన నేను మద్రాస్ వెళ్లిన తర్వాత మొదటి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సినిమాకి హీరోయిన్ జమున అని ఆవిధంగా ఆవిడతో పరిచయం ఏర్పడిందని తెలిపారు.

నిర్మాత పోకూరి బాబురావు మాట్లాడుతూ ఆవిడతో నేను సినిమా తీయకపోయినా ఆవిడ ప్రజానాట్యమండలి బిడ్డ కావటం, ఆవిడ గురించి గొప్పగా వినటం, ఒంగోలు వచ్చినప్పుడు ఆవిడని మొదటిసారిగా చూడటం జరిగిందని, సత్యభామగ ఆవిడని తప్ప వేరే ఎవరిని ఆపాత్రలో ఊహించలేమని చెప్పారు.

మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాదాల రవి అధ్యక్షులుగా జరిగిన ఈ సభలో దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, ధవళ సత్యం, మద్దినేని రమేష్, నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు, కందిమళ్ళ ప్రతాప్ రెడ్డి, నళిని, కృష్ణ కుమారి తదితరులు పాల్గొనగా వందేమాతరం శ్రీనివాస్, పల్లె నర్సింహా పాటలు అలరించాయి,

చివరగా జమున కుమారుడు వంశీ మాట్లాడుతూ తన తల్లికి ప్రజానాట్యమండలి అంటే ఎనలేని గౌరవమని, మాకు చిన్నప్పటి నుండీ సంస్కృతి సంప్రదాయాలతో పాటు అభ్యుదయం కూడా నేర్పిందని, ప్రజానాట్యమండలి సంతాప సభతో ఆవిడ ఆత్మ తప్పకుండా సంతోషిస్తుందని తెలిపి సభకు ధన్యవాదములు తెలిపారు.