పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్.థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం జూలై 28న విడుదలై విశేష ఆదరణ పొందుతోంది. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ భారీ వసూళ్లతో దూసుకుపోతూ హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “జీ స్టూడియోస్ తో కలిసి ఇది నాకు మూడో సినిమా. చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ సినిమాలో మా మావయ్య పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కృతఙ్ఞతలు. సముద్రఖని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన ప్రయాణాన్ని చిన్నగా మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారు. ముందుముందు మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను. థమన్ నేపథ్య సంగీతంతో కట్టిపడేసాడు. కళ్యాణ్ మావయ్య గురించి, త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే అంత అర్హత నాకు లేదు. త్రివిక్రమ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. త్రివిక్రమ్ గారు నన్ను నమ్మి, నేను పూర్తిగా కోలుకునే వరకు సముద్రఖని గారిని వెయిట్ చేయించారు. బ్రో చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులు అందరికీ కృతఙ్ఞతలు” అన్నారు.
కథానాయిక కేతిక శర్మ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను. ఇంతమంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన త్రివిక్రమ్ గారికి, దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ లవ్లీ కో స్టార్. థమన్ గారి సంగీతం ఎంతగానో ఆకట్టుకుంది. మా సినిమాకి ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు” అన్నారు.
నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారి కలయికలో మా 25 వ సినిమా చేయడం సంతోషంగా ఉంది. అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేయడానికి ప్రధాన కారణం సముద్రఖని గారు. ఇంత మంచి సినిమాని, త్రివిక్రమ్ గారు తన సంభాషణలతో ప్రేక్షకుల హృదయాల్లోకి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రమిది. మామూలుగా నాకు సినిమా చూసేటప్పుడు ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. అలాంటిది ఈ సినిమా చూసేటప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ చూడలేదు. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు” అన్నారు.
సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ.. “ముందు నుంచి అనుకున్నట్లుగానే ఈ సినిమాలో ఇచ్చిన సందేశం కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ సినిమాకి పెద్ద రన్ ఉంటుందని ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాని పూర్తి చేయడానికి అందించిన సహకారం మరవలేనిది. తేజ్ గారు అంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత కూడా ఎంతో కష్టపడి సినిమాకి ప్రాణం పోశారు. థమన్ అద్భుతమైన సంగీతం అందించారు. సముద్రఖని గారు 24 గంటలు సినిమా గురించే ఆలోచిస్తారు. ఈ సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు” అన్నారు.
దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ.. “మేమందరం కలిసి ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకొచ్చాము. అందరూ ఈ సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడటం, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం సంతోషంగా ఉంది” అన్నారు.
సంగీత దర్శకుడు ఎస్.థమన్ మాట్లాడుతూ.. “ముందుగా నా ధైర్యం, నా బలం త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు పనిచేయడానికి కారకులైన ఆయనకు రుణపడి ఉంటాను. నా సంగీతంలో ఇంత పరిణితి కనబడటానికి కారణం త్రివిక్రమ్ గారే. సముద్రఖని గారు నాకు 20 ఏళ్ళ ముందు నుంచే తెలుసు. ఆయన మట్టి మనిషి. వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన ఎంత బాగుంటుందో అంత స్వచ్ఛంగా ఉంటాం. ఈ సినిమా వల్ల ఆయనతో నా అనుబంధం మరింత బలపడింది. పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, సాయి తేజ్ కి యాక్సిడెంట్ అయినప్పుడు అంత బాధపడ్డాను. అంత ఇష్టం సాయి అంటే. మనసుకి చాలా దగ్గరైన మనిషి. అందుకే సాయి తేజ్ సినిమాకి మనసుతో పని చేస్తాను. క్లయిమాక్స్ లో నా సంగీతంతో సాయి తేజ్ పై ప్రేమని చూపించాను. పవన్ కళ్యాణ్ గారిని టైంగా చూస్తూ నేపథ్య సంగీతాన్ని మరింత బాధ్యతతో చేశాను. ఇంతమంచి సినిమాని ఇచ్చిన సముద్రఖని గారికి థాంక్స్.” అన్నారు.
నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ.. “ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా వేడుకలకు హాజరయ్యాను. ఇప్పుడు ఆయన సినిమా వేడుకకు వేదికపై నిల్చొని మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను. మామూలుగా మేము భోజనం చేసేటప్పుడు ఫోన్లు చూసుకుంటూ ఉంటాం. అలాంటిది బ్రో సినిమా చూసి వచ్చాక, ఫోన్లు చూడకుండా ఒకరికొకరు చూసుకుంటూ మాట్లాడుకున్నాం. అది బ్రో సినిమా ప్రభావం. కొన్ని సినిమాలు వినోదాన్ని అందిస్తాయి, కొన్ని సినిమాలు సందేశాన్ని ఇస్తాయి.. బ్రో సినిమా వినోదంతో పాటు సందేశాన్ని ఇచ్చింది. టైం విలువ తెలిసేలా చేసిన గొప్ప చిత్రమిది. ఇంతటి గొప్ప చిత్రాన్ని అందించిన పవన్ కళ్యాణ్ గారికి, సాయి ధరమ్ తేజ్ గారికి, దర్శకనిర్మాతలకు హ్యాట్సాఫ్.” అన్నారు.
దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోమ్ బ్యానర్ లాంటిది. సముద్రఖని గారిని చాలా దగ్గర నుండి చూశాను. ఆయనతో కాసేపు మాట్లాడితే చాలు, చాలా పాజిటివ్ గా ఉంటుంది. సినిమా కూడా అలాగే చేశారు. ఆయన దగ్గర ఇలాంటి మంచి కథలు ఇంకా చాలా ఉన్నాయి. సినిమాలో త్రివిక్రమ్ గారి సంభాషణలు చాలా బాగున్నాయి. స్టార్ హీరోలు ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చేయడం చాలా అరుదు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాయి ధరమ్ తేజ్ లాంటి మంచి మనిషికి వరుస విజయాలు రావడం సంతోషంగా ఉంది” అన్నారు.
దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. “సముద్రఖని గారు గొప్ప నటుడు. అంతకంటే గొప్ప రచయిత, దర్శకుడు. ఆయన నటనను కొనసాగిస్తూనే ఇలాంటి మంచి సినిమాలను తీయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చూసి చాలా కదిలిపోయాను. జీవిత సత్యం తెలిసింది. ఇలాంటి మంచి సినిమా పవన్ కళ్యాణ్ గారి లాంటి స్టార్ , త్రివిక్రమ్ గారి లాంటి స్టార్ రైటర్ చేయడం వల్ల ఎక్కువమందికి చేరువ అవుతుంది. ఇంతమంచి చిత్రాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు” అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ..”ఈ సినిమాలో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూసి మెస్మరైజ్ అయ్యాను. ఇది చాలా అద్భుతమైన పాయింట్. త్రివిక్రమ్ గారి సంభాషణల్లో ఎంతో లోతైన భావం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని, సాయి ధరమ్ తేజ్ ని కలిసి తెరమీద చూడటం కన్నులపండుగలా అనిపించింది. కాలం విలువని చెబుతూ, కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా అద్భుతమైన చిత్రాన్ని అందించిన దర్శకనిర్మాతలకు కృతఙ్ఞతలు” అన్నారు.
దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. “ముందుగా నిర్మాతలు విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి కంగ్రాట్స్. మీరు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారితో ఒక మాస్ సినిమాని చేయొచ్చు. కానీ ఇలాంటి సినిమా చేయడం నిజంగా గొప్ప విషయం. సముద్రఖని ఈ సినిమాని నమ్మి చాలా నెలలు దీనికోసమే పనిచేశారు. సాయి ధరమ్ తేజ్ మంచి మనసుకి ఇది దేవుడు ఇచ్చిన గిఫ్ట్. త్వరలోనే చిరంజీవి గారితో కూడా కలిసి నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. థమన్ నేపథ్యసంగీతం అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో టైం గురించి చెప్పారు. ” అన్నారు.
దర్శకుడు గోపీచంద్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు నాకు అత్యంత ఆప్తులు. ఇంతమంచి సినిమాని అందించిన మీ అందరికీ థాంక్స్. సముద్రఖని ఎంత మంచి మనిషో, ఆయన ఆలోచనలు అంత మంచిగా ఉంటాయి. అందుకే బ్రో లాంటి మంచి సినిమా వచ్చింది. ఇలాంటి కాన్సెప్ట్ చేయడానికి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాఫ్. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూడటం బాగుంది. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఏడిపించారు. కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రమిది.” అన్నారు.