ఆస్కార్‌ విజేత చంద్రబోస్‌ కలం గెలుచుకున్న సౌజన్య భాగవతుల!

ఏప్రిల్ 15, హైద‌రాబాద్‌: తెలుగు ఇండియన్‌ ఐడల్‌2తో సంగీత ప్రపంచంలో సరికొత్త జోరు కనిపిస్తోంది. ఆస్కార్‌ విజేత సినీగీత రచయిత చంద్రబోస్‌ ప్రత్యేక అతిథిగా తెలుగు ఇండియన్‌ ఐడల్‌2 ఎపిసోడ్‌ చిత్రీకరించారు. టాప్‌ 9 కంటెస్టంట్లతో పాటు ఆ వేదిక మీద చంద్రబోస్‌ని చూసిన జనాల ఉత్సాహానికి అంతే లేదు.

తెలుగు సినీ సంగీతంలో అజరామరమైన కొన్ని గీతాలను పోటీదారులు ఎంపిక చేసుకుని పాడిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వారిలోని ప్రతిభ, కళ పట్ల వారికున్న ఆసక్తి చూసి అబ్బురపడ్డారు. అందరిలోనూ సౌజన్య భాగవతుల ప్రత్యేక స్థానాన్న ఆక్రమించారు. నాని సినిమాలోని పెదవే పలికిన మాటల్లోనే గీతాన్ని ఆలపించారు సౌజన్య భాగవతుల. ఆ పాటను ఆమె పాడిన తీరుకు ఉప్పొంగిపోయారు ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్‌. అద్వితీయమైన గళం అంటూ ప్రశంసించి తన కలాన్ని ఆమెకు బహూకరించారు.

ఆస్కార్‌ అవార్డు అందుకున్న నాటు నాటు గీతాన్ని రాసిన కలం అంటూ ఆ కలం గురించి పరిచయం చేశారు. అనూహ్యమైన ఆ క్షణాలను పదిలపరచుకున్నారు సౌజన్య. న్యాయనిర్ణేతలకు, సహ గాయనీగాయకులకు తన ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఆమె మాట్లాడుతూ ”చంద్రబోస్‌గారి నుంచి ఈ కలం అందుకోవడం గర్వంగానూ, గౌరవంగానూ భావిస్తున్నాను. నా చిరకాల స్వప్నం నెరవేరింది. సంగీతంలో మరెన్నో ఎత్తులకు చేరుకోవాలన్న ఆకాంక్ష బలోపేతమైంది. అత్యంత గొప్ప అవకాశం ఇది” అని అన్నారు.

ఎన్నో దశాబ్దాలుగా తనదైన ముద్రతో పాటలు రాస్తూ, తెలుగు సినీ సంగీతంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన చంద్రబోస్‌ మాట్లాడుతూ ”ఆహా తెలుగు ఇండియన్‌ ఐడటల్‌2లో పాల్గొనడం చాలా ఆనందంగా అనిపించింది. అత్యద్భుతమైన ప్రతిభావంతులున్నారు ఇక్కడ. తెలుగు సినీ సంగీతానికి వీరందరూ గొప్ప ఆస్తి. సౌజన్య ప్రతిభ నన్ను అబ్బురపరిచింది. తన స్వరంతో, సంగీతంతో ఆమె మరెన్నో మెరుపులు కురిపిస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులను ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌2 ఉర్రూతలూగిస్తోంది. ప్రతిభావంతులైన ఔత్సాహికులకు ఓ అందమైన వేదికగా మారింది. ప్రేక్షకులకు చక్కటి అనుభూతి కలిగిస్తోంది. పవర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్సులు, మనసును హత్తుకునే అంశాలు, అద్వితీయమైన ప్రతిభ ఈ షోని గొప్ప గొప్ప తీరాలకు తీసుకెళ్తోంది.

సౌజన్య భాగవతుల ప్రతిభను తెలుసుకోవాలనుకునేవారు ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌2 అన్ని ఎపిసోడ్స్ ని చూడండి…. మీకోసం… మీ ఆహాలో!