‘అర్థమైందా అరుణ్ కుమార్’… ఆకట్టుకుంటోన్న టీజర్

పోటీ ప్ర‌పంచంలో అంద‌రూ ఊరుకులు ప‌రుగులు మీదుంటారు. కానీ ఇవేమీ తెలియ‌ని ఓ కుర్రాడు.. జీవితంలో ఏదో సాధించాల‌నే సంకల్పంతో సిటీలోకి అడుగు పెడ‌తాడు. అత‌ని పేరే అరుణ్ కుమార్‌. త‌ను కోరుకున్న జీవితాన్ని సాధించాల‌నుకుని ఇంటర్న్ షిప్ ఉద్యోగంతో హైద‌రాబాద్‌లోకి అడుగు పెడ‌తాడు. అయితే అక్క‌డున్న త‌న కొలీగ్స్ మాత్రం.. ఇంట‌ర్న్ ఉద్యోగి అంటే ప్యూన్ కానీ ప్యూన్ అనేలా అన్నీ ప‌నులు త‌నతో చేయిస్తారు. ఏదైనా ఆఫీసు ప‌ని చెప్ప‌మ‌ని అడిగిన ప్ర‌తీసారి అంత ఈజీగా నీకేది దొర‌క‌దు అర్థ‌మైందా? అని అంద‌రూ చెబుతుంటారు. ఇలాంటి ప‌రిస్థితుల నుంచి ఆ యువ‌కుడు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడ‌నేది తెలుసుకోవాలంటే జూన్ 30న అచ్చ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ చూడాల్సిందే.

శనివారం మేకర్స్ ‘అర్థమైందా అరుణ్‌కుమార్‌’ టీజర్‌ను విడుద‌ల చేశారు. ఓ ఇంట‌ర్న్ బాధ‌ల‌ను అందులో చూపించారు. అత‌నొక్క‌డే కాదు..సిటీలో అలాంటి ఇంట‌ర్న్స్ బాధ‌లు ఎలా ఉంటాయ‌నే కాన్సెప్ట్‌తో రూపొందిన సిరీస్ ఈ ‘అర్థమైందా అరుణ్ కుమార్’. హర్షిత్ రెడ్డి తనదైన నటనతో మెప్పించారని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్‌ను ఆరె స్టూడియోస్‌, లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ రూపొందించాయి. ఇంకా ఈ సిరీస్‌లో అన‌సూయ శ‌ర్మ‌, తేజ‌స్వి మ‌డివాడ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

శిల్పం తయారు అయ్యే క్రమంలో ఎన్నో ఉలి దెబ్బలు తినాలి. అలాగే ఈ సిరీస్‌లో అరుణ్‌కుమార్ సైతం ఈ పోటీ ప్ర‌పంచంలో త‌న‌ని తాను మ‌లుచుకుంటూ ఎలా ఎదిగాడ‌నే విష‌యాల‌ను చ‌క్క‌గా చూపించారు. ఈ క్ర‌మంలో తాను ఎలాంటి పాఠాల‌ను నేర్చుకున్నాడు.. నేర్పించాడనే అంశాల‌ను హృద్యంగా స్పృశించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కార్పొరేట్ ప్ర‌పంప‌చంలో ఒడిదొడుకుల‌ను ఎదుర్కొంటున్న ఉద్యోగుల‌కు క‌నెక్ట్ అయ్యే క‌థాంశం.

‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్ ఆహాలో జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.