కాంగ్రెస్ ట్రంప్‌కార్డ్ ప్రియాంకాగాంధీ వాద్రా రాజకీయ రంగ ప్రవేశంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొట్టమొదటిసారిగా స్పందించారు. ప్రియాంక గాంధీ రాజకీయాల్లో అడుగు పెట్టడం వల్ల కాంగ్రెస్ పరిస్థితి బాగుపడుతుందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టి పడేశారు. ఆమె రాక వల్ల కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ ఉండదని తన దైన శైలిలో వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలను ఆయన సున్నాలతో పోల్చారు.
`ఒక సున్నాకు, ఇంకో సున్నా జత కలిసిందంతే..` అని తేలిగ్గా తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంలో విలేకరులతో ముచ్చటించారు. `జీరో ప్లస్ జీరో ఎప్పుడూ జీరోనే అవుతుంది. రాజకీయాల్లోకి రావడం ప్రియాంక గాంధీకి ఇదేమీ తొలిసారి కాదు. 2014, 2017 ఎన్నికల్లోనూ ఆమె పార్టీకి నాయకత్వం వహించారు. అప్పట్లో కాంగ్రెస్ ఎలాంటి దుస్థితిలో పడిపోయిందో, ఇప్పుడూ అదే దుస్థితిలో ఉంటుంది. ఆమె రాక ప్రభావం బీజేపీపై ఎంతమాత్రమూ పడదు..` అని చెప్పారు.