కాంగ్రెస్ లో సోనియా శకం ముగింపు? 2019 ఎన్నికల్లో అమెథీ అభ్యర్థి ఎవరు?

కాంగ్రెస్ పార్టీ భవితవ్యానికి కీలకమయిన  2019 ఎన్నికల్లో పార్టీ పెద్దదిక్కు  సోనియా గాంధీ పోటీ చేయరా? ఈ అనుమానం కాంగ్రెస్ నేతలను పీడిస్తూ ఉంది. సోనియా గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి లోక్ సభకు గెలుపొందుతూ వస్తున్నారు. ఇది  సోనియా కుటుంబ నియోజకవర్గం అయిపోయింది. దేశంలోని వివిఐపి నియోజకవర్గాల జాబితాలో ముందుంటుంది. అయితే, ఈ నియోజకవర్గం నంచి ఆమె పోటీచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగా లేదు. ఆమె తరచు చికిత్సకు  అమెరికా వెళ్తున్నారు. రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు ఇవ్వడం వెనక కూడా ఇదే కారణమని అపుడు చెప్పుకున్నారు. ఇపుడు ఇదే కారణం చేత ఆమె 2019 ఎన్నికల్లో పోటీ చేయక పోవచ్చని, తనకి  బదులు కూతురు ప్రియాంక వాద్రాని పోటీ చేయించవచ్చని మీడియాలో వార్తలొస్తున్నాయి.

ఈ సారి సోనియాను(రాయ్ బరేలీ,రాహుల్ (అమేధీ) లలో ఓడించాలని బిజెపి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నది. కాంగ్రెస్ ముక్త భారత్ ఏర్పాటు వీరిద్దరిని ఓడించి లోక్ భలో  కనిపించకుండా చేయడం ఒక మార్గమని బిజెపి విశ్వాసం.

ఒక వైపు నుంచి సోనియాగాంధీ రాయ్ బరేలి పర్యటనలు ఆరోగ్య కారణాల వల్ల తగ్గిపోతే, బిజెపి నేతలు అనేక సార్లు చక్కర్లు కొట్టి పార్టీని గెలిపంచుకోవాలని చూస్తున్నారు. ఆమె బుధవారం నాడు రాయ్ బరేలిలో రెండు రోజుల పర్యటనకోసం వస్తున్నారు. అంతకు ముందు 9 నెలల కిందట వచ్చారు. అది రేండున్నరేళ్ల తర్వాత జరిగిన పర్యటన. అయితే, ఈ గ్యాప్ ని బిజెపి బాగా వాడుకుని లబ్దిపొందాలని చూస్తున్నది.గత డిసెంబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ నియోజకవర్గంలో పర్యటించారు. అనేక అభివృద్ధి కార్యక్ర మాలకు శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవాలు జరిపారు.

మరొక వైపు రాహుల్ అమేధీలో కేంద్ర మంత్రి సృతి ఇరానీ పర్యటించాలని చూస్తున్నారు. అంతే కాదు, బిజెపి ఏకంగా ఆమెనే అక్కడి నుంచి రాహుల్ మీద పోటీకి దించాలని చూస్తున్నారు. అయితే, రాహుల్ కర్నాటకలో ని బీదర్ నుంచి పోటీ చేస్తారని కూడా వార్తలొస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వాళ్లు, గతంలో ఇందిరా గాంధీ లాగా, మెదక్ నుంచి పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నారు. ఇదంతా వేరే కథ.

ఉత్తర ప్రదేశ్ విషయానికి వస్తే, ఈ సారి అంటే జనవరి 23 నుంచి సోనియాగాంధీ రాహుల్ తో కలిసే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అనేక గ్రామాలలో ఎంపి లాడ్ కింద జరిగే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఒకే గెస్ట్ హౌస్ లో బస చేసి వేర్వేరుగా తమ తమ నియోజకవర్గాల ప్రజలతో మాట్లాడతారు.

ఇదంతా బాగానే ఉంది కాని, ఆరోగ్యం బాగా లేదని ఆమె ఈ సారి పోటీ చేయరని, కూతరు పోటీ చేస్తారనే వార్త యుపిలో, ముఖ్యంగా రాయ్ బరేలీలో సంచలనం సృష్టిస్తున్నది. స్థానిక కాంగ్రెస్ నేతలు, అభిమానులు ఈ విషయంలో గందరగోళంలో పడ్డారు. మీడియాలోనేమో వార్తలొస్తున్నాయి. పార్టీ నాయకత్వంలోనుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ప్రియాంక పోటీకి వ్యతిరేకత లేదు. అయితే, సోనియాగాంధీకి నియోజకవర్గంతో ఉన్న అనుబంధాన్ని, అభిమానాన్ని ఒక్కసారిగా ప్రియాంకకు బదలాయించాలి. అయితే, ప్రియాంక నియోజకవర్గానికి కొత్త కాదు. అమె అపుడపుడు వచ్చి పార్టీ నేతలతో, కార్యకర్తలతో మాట్లాడుతూనే ఉన్నారు 2017 యుపి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె పర్యటించి ప్రచారం చేశారు. అందుకే ప్రియాంక పోటీ చేస్తే గెలపు సులభమేనని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయినా సరే, మార్పు టాక్ ఇక్కడ కొంత  ఇబ్బంది కలిగిస్తూనే ఉందని చెబుతున్నారు.

ఆరోగ్యం బాగా లేకపోవడంతో , ఎలాగయితే, ఆమె రాహుల్ ను పార్టీ అధ్యక్షుడిని చేశారో, అలాగే రాయ్ బరేలీకి ప్రియాంక అభ్యర్థిని చేయవచ్చనేదాన్ని చాలా మంది నమ్ముతున్నారు. ఏమవుతందో చూడాలి.