సాధారణంగా అడిగినంత కట్నం ఇవ్వలేదనో, గౌరవ మర్యాదలు సరిపోలేదనో పెళ్లిళ్లు రద్దవుతుంటాయి. చాలా సార్లు వరుడి బంధువులు అలగడం, వారిని వధువు తరపు వారు బుజ్జగించడం చూస్తుంటాం. కానీ ఉత్తర ప్రదేశ్ లో మాత్రం విచిత్రంగా వాట్సాప్ కారణంగా ఓ పెళ్లి రద్దయింది. అమ్మాయి తండ్రి ముఖం మీదే ఈ పెళ్లి జరగదని వరుడి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. ఇంతకీ వాట్సాప్ లొల్లి తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…
ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాకు చెందిన యువతికి లక్నోకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. శనివారం వారి వివాహాం జరగాల్సి ఉంది. ఫంక్షన్ హాల్ వద్ద వరుడి కోసం వధువు కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే ఫంక్షన్ హాల్ కు చేరుకున్న వరుడి కుటుంబ సభ్యులు ఈ పెళ్లి జరగదని చెప్పే సరికి వధువు కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.
పెళ్లేందుకు రద్దు చేసుకుంటున్నారని ప్రశ్నించగా పెళ్లి కూతురు ఎప్పుడూ చూసిన వాట్సాప్ లోనే ఉంటుందని ఆమె ప్రవర్తనపై తమకు అనుమానంగా ఉందంటూ వరుడి కుటుంబ సభ్యులు సమాధానం ఇచ్చారు. వాట్సాప్ లో ఆమె ఎప్పుడూ కూడా ఆన్ లైన్ లోనే ఉంటుందని అంతగా తను చాట్ చేయాల్సిన అవసరమేముంటుందని వారు ప్రశ్నించారు. చాలా విచిత్రమైన ప్రశ్న కావడంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు వాట్సాప్ సమస్య కాదని వారు డిమాండ్ చేసిన రూ.64 లక్షల కట్నం ఇవ్వనందుకే పెళ్లి రద్దు చేసుకుంటున్నారని వదువు కుటుంబ సభ్యులన్నారు.
సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ఈ రోజుల్లో ఆ అమ్మాయి వాడిన అతి వాట్సాప్ చివరికి తన పెళ్లికే ఎసరు తెచ్చింది. అయినా వాట్సాప్ లో నిత్యం ఉంటుందని పెళ్లి రద్దు చేసుకోవడమేంటని అంతా చర్చించుకుంటున్నారు.