ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ విచిత్ర ఘటన ప్రజలను నివ్వెర పరుస్తోంది. బోరు పంపు నుంచి నీళ్లు కావాలంటే దాని హ్యాండిల్‌ను అదే పనిగా చేతులు నొప్పి పుట్టేలా కొట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ తరహా చేతి పంపు బోర్లు ఇప్పుడు వేసినవి కాదు. కానీ, ఇమేజ్‌లో మీరు చూస్తోన్న బోరు పంపుకు మాత్రం అలాంటి అవసరం లేదు. ఎవరూ కొట్టకుండానే ఆ బోరు పంపు నుంచి నీరు ఉబికివస్తోంది. దీంతో ఈ వింత ఘటనను చూసేందుకు జనం తరలివస్తున్నారు. నెల్లూరు జిల్లాలో గత నాలుగు రోజులుగా భారీ తుఫాన్ కారణంతో ఆత్మకూరు ప్రాంతంలో భారీగా వరద నీరు ప్రవహించింది. ఈ వరద ప్రవాహంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. దీని ప్రభావంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయాయి. అందుకే ఆత్మకూరు పట్టణంలోని కాలేజ్ వీధిలో ఓ చేతి పంపు నుంచి పంపు కొట్టకుండానే జలధార వస్తోంది.
నీరు దానంతట అదే వస్తుండటంతో బోరింగ్ వద్ద వీధిలోని వారంతా హాయిగా నీళ్లు పట్టుకుని వెళ్తున్నారు. ఒకరి ప్రమేయం లేకుండానే బోరు నీళ్లు తాగి వెళుతున్నారు. ముఖ్యంగా పెద్దవారు, వీధి వెళ్తున్న పాదచారులకు ఈ బోరింగ్ ఇప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, గతంలో కూడా తుఫాన్ ప్రభావం వల్ల దాదాపు నెల నుండి రెండు నెలల పాటు ఈ బోరింగ్ ద్వారా ఇలాగే నీళ్లు వచ్చాయని చెబుతున్నారు. ఈ చేతి పంపు నుండి కొట్టకుండానే జలధార వస్తుండడంతో స్థానికులు ఈ బోరింగ్‌ను వింతగా చూస్తున్నారు.
అయితే ఇలాంటి ఘటనలు కొత్తేమి కాదు. గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేకం చూశాం. అయితే స్థానిక ప్రాంతాలలో ఉండేవాళ్లకు అవగాహన ఉండకపోవడంతో దాన్ని వింతగా చెప్పుకుంటున్నారు. కాగా ఇటీవల వర్షాలకు భూ గర్భ జలాల స్థాయి అమితంగా పెరిగింది. బావుల్లో అయితే నీరు చేతికి అందుకున్నాయి. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరమైన విషయం. అది అతివృష్ఠి, అనావృష్ఠి ఏది ప్రమాదమే. ఆ విషయం కూడా గుర్తుంచుకోవాలి.