రాజ్యసభలో ఉప రాష్ట్రపతి వెంకయ్య కంటతడి

భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కంటతడి పెట్టారు.. అదీ రాజ్యసభ సాక్షిగా. పెగాసస్, రైతు చట్టాల వ్యవహారానికి సంబంధించి విపక్షాలు గందరగోళం సృష్టించడం, రాజ్యసభ ఛైర్మన్ సీటుపైకి ఎగబడటం.. వంటి పరిణామాలపై వెంకయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజమే, వెంకయ్యానాయుడి ఆవేదనను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిందే. చట్ట సభల్ని ప్రజాస్వామ్యంలో దేవాలయాలుగా భావించాల్సిందే. కానీ, చట్ట సభల్లో గలాటా కొత్త వ్యవహారం కాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోతున్న సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, అప్పటి లోక్ సభ, రాజ్యసభల్లో ఏం జరిగిందో చూశాం. వాటితో పోల్చితే, తాజా ఘటనలు పెద్ద వ్యవహారాలేమీ కావు. చట్ట సభలకు ఇంకా ప్రజల్లో గౌరవం వుందని ఎవరైనా అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. నిజానికి, చట్ట సభల గౌరవాన్ని దిగజార్చుతున్నదే ఆయా చట్ట సభలకు ఎంపికవుతున్న కొందరు సభ్యులు.

అలాంటివారిని ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలది అసలు తప్పిదం. చట్ట సభల సాక్షిగా ప్రజలకు లభిస్తున్న హామీలు, ఆ తర్వాత బుట్టదాఖలవుతున్న దరిమిలా, చట్ట సభలకు ప్రభుత్వాలు నడుపుతున్నవారు సైతం విలువ ఇస్తున్నారని ఎలా అనుకోగలం.? చట్ట సభల్లో బూతు బొమ్మలు చూస్తున్న రాజకీయ నాయకులు, చట్ట సభల్లో బూతులు మాట్లాడుతున్న నాయకులు.. చట్ట సభల్లో కొట్టుకుంటున్న నాయకులు.. ఇవన్నీ దేశంలో ఎక్కడో ఓ చోట అను నిత్యం వింటున్న, చూస్తున్న వ్యవహారాలే. మరి, చట్ట సభలకు గౌరవమెలా పెరుగుతుంది.? తొలుత చట్ట సభలకు నేరచరితుల్ని పంపకుండా రాజకీయ పార్టీలు కఠినంగా వ్యవహరించాలి. అదే సమయంలో, పార్టీ ఫిరాయింపులనేవి వుండకూడదు. అవన్నీ ఆశించగలమా.? ఛాన్సే లేదు. అలాంటప్పుడు, చట్ట సభల గౌరవమెలా పెరుగుతుంది.?