అర్ధ కుంభ‌మేళాలో కేబినెట్ భేటీ

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ మంగ‌ళ‌వారం త‌న మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని వినూత్నంగా నిర్వ‌హించారు. ప్ర‌యాగ్‌రాజ్‌లో వైభ‌వంగా కొన‌సాగుతున్న అర్ధ కుంభ‌మేళాలో మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ప‌లు కీల‌క అంశాల‌పై తీర్మానాలు చేశారు. మీర‌ట్ నుంచి ప్ర‌యాగ్‌రాజ్ వ‌ర‌కు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను మంత్రివ‌ర్గం ఆమోదించింది.

ఈ ఎక్స్‌ప్రెస్ వే పొడ‌వు 600 కిలోమీట‌ర్లు. దీని నిర్మాణానికి 36000 కోట్ల రూపాయ‌లు అవ‌స‌రం అవుతాయ‌ని అంచ‌నా వేశారు. 6,550 హెక్టార్లు అవ‌స‌రం అవుతాయ‌ని భావిస్తున్నారు. మీర‌ట్ నుంచి మొద‌ల‌య్యే ఈ ఎక్స్‌ప్రెస్ వే అమ్రోహా, బులంద్‌షెహ‌ర్‌, బ‌దౌన్‌, షాజ‌హాన్‌పూర్‌, క‌న్నౌజ్‌, ఉన్నౌ, రాయ్‌బ‌రేలీ, ప్ర‌తాప్‌గ‌ఢ్ మీదుగా ప్ర‌యాగ్‌రాజ్ వ‌ద్ద ముగుస్తుంది.

దీనితోపాటు గోర‌ఖ్‌పూర్‌ను అనుసంధానించే 91 కిలోమీట‌ర్ల పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి కూడా యోగి కేబినెట్ ఆమోదం తెల‌పింది. మంత్రివ‌ర్గ భేటీ ముగిసిన అనంత‌రం యోగి ఆదిత్య‌నాథ్ అర్థ‌కుంభ‌మేళాలో ప‌విత్ర స్నానం ఆచ‌రించారు. రాజ‌ధాని ల‌క్నో బ‌య‌ట ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ మంత్రివర్గం భేటీ కావ‌డం ఆ రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇదే రెండోసారి. 1962లో అప్ప‌టి యూపీ ముఖ్య‌మంత్రి గోవింద్ వ‌ల్ల‌భ్ పంత్ నైనిటాల్‌లో మంత్రివ‌ర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.