కుమార‌స్వామి కుర్చీకి ఎస‌రు: ఇద్ద‌రు ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉపసంహ‌ర‌ణ‌

అస‌లే బొటాబొటి మెజారిటీ. మ‌రోప‌క్క‌- ఆప‌రేష‌న్ క‌మ‌ల‌. ఏ ఒక్క ఎమ్మెల్యే వైదొల‌గినా కుర్చీ, స‌ర్కారీ కూస‌లు క‌దిలిపోయే ప‌రిస్థితి. ఇలాంటి సంక్షోభంలో ఏడెనిమిది నెల‌లుగా ప్ర‌భుత్వాన్ని నెట్టుకొస్తున్న క‌ర్ణాట‌క‌లోని జ‌న‌తాద‌ళ్ (ఎస్‌)-కాంగ్రెస్ ప్ర‌భుత్వం నెత్తిన పిడుగు ప‌డింది. జ‌న‌తాద‌ళ్‌-కాంగ్రెస్ కూట‌మికి ఇస్తోన్న మ‌ద్ద‌తును ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు ఇద్ద‌రు స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంక‌ర్‌, హెచ్ న‌గేష్ ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు వారు గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలాకు లేఖ ఇచ్చారు. ఈ ఇద్ద‌రిలో ఒక‌రు మంత్రి కూడా. అట‌వీశాఖ మంత్రిగా ఉన్న స్వ‌తంత్ర ఎమ్మెల్యే ఆర్ శంక‌ర్ ఉత్త‌ర క‌ర్ణాట‌క‌లోని రాణిబెన్నూరు, హెచ్ న‌గేష్..ముళ‌బాగిలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఆప‌రేష‌న్ క‌మ‌ల‌లో భాగంగా బీజేపీ ఇప్ప‌టికే క్యాంపు రాజ‌కీయాల‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా కొంద‌రు గుర్‌గావ్‌లోను, మ‌రికొంద‌రు ముంబైలోనూ ఉంటున్నారు.

ఆర్ శంక‌ర్‌, హెచ్ న‌గేష్ ముంబైలో ఓ హోట‌ల్‌లో ఉంటున్నారు. మ‌ద్దతును ఉప‌సంహ‌రించుకున్న ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా త‌మ లేఖ‌ను ముంబై నుంచే క‌ర్ణాట‌క రాజ్‌భ‌వ‌న్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. దీన్ని ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి తేలిగ్గానే తీసుకున్నారు `నా బ‌ల‌మేంటో నాకు తెలుసు. ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు. ఇప్పుడు రిలాక్స్డ్‌గా ఉన్నా..` అని ఆయ‌న బెంగ‌ళూరులో విలేక‌రుల‌తో వ్యాఖ్యానించారు.

224 అసెంబ్లీ స్థానాలు ఉన్న క‌ర్ణాట‌క అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి 112 స్థానాలు అవ‌స‌రం. బీజేపీకి 105 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌-76, జ‌న‌తాద‌ళ్ ఎస్ – 39 స్థానాలు చేతిలో ఉన్నాయి. ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవ‌త‌రించిన‌ప్ప‌టికీ.. మ్యాజిక్ ఫిగ‌ర్‌ను అందుకోలేక‌పోయింది. దీనితో కాంగ్రెస్‌-జేడీఎస్ క‌లిసి 115 స్థానాల‌తో ప్ర‌భుత్వాన్ని నెల‌కొల్పాయి. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించ‌డంతో మెజారిటీ 113కు ప‌డిపోయింది.

తాజా ప‌రిణామాల‌పై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టింది. పార్టీ క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి వేణుగోపాల్ బెంగ‌ళూరుకు చేరుకున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌ర‌మేశ్వ‌ర‌ప్ప‌, భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి డీకే శివ‌కుమార్ త‌దిత‌రులతో స‌మావేశ‌మ‌య్యారు.