టాయ్‌లెట్ కేఫ్టేరియా..వినడానికి కాస్త ఆడ్‌గా ఉంది కదూ! నిజం. అక్కడ కనిపించే కేఫ్టేరియాలో కుర్చీల స్థానంలో టాయ్‌లెట్ కమోడ్లు ఉంటాయి. దీనిపై ఎలా కూర్చుంటారనే అనుమానాలూ వద్దు. మందంగా ఉండే అద్దాన్ని ఉంచుతారు. దానిపై కూర్చుని జనం టిఫినీలు తింటారు..కాఫీలు తాగుతారు.
స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా..వ్యక్తిగత మరుగుదొడ్లపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. బహిరంగ మల, మూత్ర విసర్జన వల్ల సంభవించే రోగాలపై సందర్శకులకు వివరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గ్రామీణులు పెద్ద సంఖ్యలో కుంభమేళాకు వస్తారని, వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై వారికి అవగాహన కల్పించడానికి ఇది సరైన వేదిక అని అంటున్నారు.
కుర్చీలో స్థానంలో టాయ్‌లెట్ కమోడ్లను ఉంచారనే వార్త విని పెద్ద ఎత్తున గ్రామీణులు, నిరక్షరాస్యులు కేఫ్టేరియాకు వస్తున్నారట. వచ్చిన వారికి వచ్చినట్టే పట్టేసుకుని వ్యక్తిగత మరుగుదొడ్లపై క్లాసులు పీకుతున్నారు అక్కడి సిబ్బంది. అక్కడ రాసిన స్లోగన్లను ఒక్కటొక్కటిగా చదివి మరీ వినిపిస్తున్నారు. వాటి అర్థాలను విడమరిచి చెబుతున్నారు.