యూపీలో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న ప్రియాంకా గాంధీ, ఓ ఆసక్తికర ఫోటోను కాంగ్రెస్ శ్రేణులతో పంచుకున్నారు. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో తన పూర్వీకుల నివాసంలో సేదదీరుతుంది. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మించిన గది చిత్రాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక్కడి స్వరాజ్ భవన్ లో ఇందిర జన్మించిన ఫోటోను పోస్ట్ చేసిన ఆమె, “స్వరాజ్ భవన్ లో నేనున్న వేళ, నానమ్మ పుట్టిన గదిని చూశాను. ఇదే సమయంలో ఆమె నాకు చెప్పిన ‘జోన్ ఆఫ్ ఆర్క్’ కథ గుర్తుకొచ్చింది. ఆ కథ వింటూ నేను నిద్రపోవడం గుర్తొచ్చింది. ఆమె గొంతు ఇప్పటికీ నా హృదయంలో వినిపిస్తోనే ఉంది. భయం లేకుండా ఉండాలని, అప్పుడే అంతా మంచి జరుగుతుందని ఆమె చెప్పేవారు” అని వ్యాఖ్యానించారు.
కాగా, ఇదే స్వరాజ్ భవన్ లో 1917, నవంబర్ 19న జన్మించిన ఇందిరాగాంధీ, తన చిన్నతనంలో కొన్నేళ్ల పాటు ఇక్కడే కాలం గడిపారు. ఇక ప్రియాంక షేర్ చేసుకున్న చిత్రంలో గోడపై ఇందిరాగాంధీ చిన్న వయసులో తీయించుకున్న ఓ ఫోటో, దాని పక్కనే జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీలతో ఉన్న చిన్ననాటి ఇందిర ఫోటో ఉన్నాయి.