మోడీ & కో మరీ బరితెగించేస్తున్నారంటూ… షాకిచ్చిన స్టాలిన్!

కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలు చాన్నాళ్లుగా వినపడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా… ఈడీ, ఐటీ, సీబీఐని మోడీ & కో పుష్కలంగా వాడేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. చిత్రంగా ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలాగానే అకేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంటుంది!

ప్రస్తుతం దక్షిణాదిలో బీజేపీకి దారులు మూసుకుపోతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. తమిళనాడులో హిందీ మాట్లాడాలి.. తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్ ఎత్తెయ్యాలి.. కర్నాటకలో బజరంగ్ దల్ ని రంగంలోకి దింపాలి… ఈ దిశగానే బీజేపీ నేతల ఆలోచనలు ఉంటాయని ప్రజల్లోకి ఒక సంకేతం పూర్తిగా వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇక దక్షిణాదిలో కమళానికి కష్టమే అనే ఆలోచనకు వచ్చారో ఏమో కానీ… తాజాగా తమిళనాడుకి ఈడీని, తెలంగాణకు ఐటీని పంపించారు.

అవును తమ మాట వినని, తమ పెత్తనాన్ని పూర్తిగా వ్యతిరేకించే రెండు రాష్ట్ర ప్రభుత్వాలపైనా కేంద్రం అస్త్రం సంధించింది. ఈ క్రమంలో తమిళనాడుకి చెందిన మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసింది ఈడీ. ఇటు తెలంగాణలో కూడా అధికార బీఆరెస్స్ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీపై ఐటీ దాడులు జరిగాయి. దీంతో స్థానికంగా బీజేపీ వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో తమిళనాడు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి తమిళనాడు తలుపులు మూసేసింది. తమ అనుమతి లేకుండా తమ రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీని నిషేధించింది. అవును… తాజాగా తమిళనాడులో ఈడీ దాడులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. నేరుగా రాష్ట్ర సచివాలయంలోకి ఈడీ అధికారులు వచ్చి సోదాలు చేయడంపై సీఎం స్టాలిన్ అభ్యంతరం తెలిపారు. అనంతరం తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన కొన్ని గంటలకే సీబీఐకి షాకిస్తూ స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాగా… దేశంలోని 9 రాష్ట్రాలు సీబీఐకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ లిస్ట్ లో 10వ రాష్ట్రంగా తమిళనాడు చేరింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌, కేరళ, జార్ఖండ్‌, పంజాబ్‌, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో సీబీఐకి ఎంట్రీ లేదు. అయితే… నోటుకు ఓటు కేసు ఉదంతం అనంతర పరిణామాల నేపథ్యంలో… గతంలో చంద్రబాబు కూడా ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ అన్నారు! ఆ తర్వాత కాలక్రమంలో సీబీఐకి ఏపీ ప్రభుత్వం తలుపులు తెరిచింది.