ఈమె పంజాబ్ సుమలత, అయితే, బిజెపిని ఎదిరించే ధైర్యం లేదు

ప్రఖ్యాత నటుడు, నాలుగుసార్లు భారతీయ జనతాపార్టీ నుంచి గెలుపొందిన వినోద్ ఖన్నా భార్య కవితా ఖన్నా పార్టీ తనకు ద్రోహం చేసిందని ఆరోపించారు. అయితే, తాను మరొకపార్టీ లోకి వెళ్ల లేనని, ఇతర పార్టీల నాయకులు తనను ఆహ్వానించారని  చెబుతూనే ఈ రోజు పార్టీ తనని ఏ మాత్రం పట్టించుకొనకపోవడం పట్ల కంట తడిపెడుతూ  ఆమె ఆవేదన బయట పెట్టారు. పార్టీ ధోరణితో గాయపడ్డాను. అందుకే బయటకు మాట్లాడుతున్నానని చెప్పారు.

వినోద్ ఖన్నా 1998 -2009 మధ్య రెండుసార్లు పంజాబ్ గురుదాస్ పూర్ నుంచి లోక్ సభకు ఎంపికయ్యారు. తర్వాత 2014 లో కూడా ఎంపికయ్యారు. అయితే, 2017లో ఆయన చనిపోయారు. అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రి వర్గంలో ఆయన కొద్ది రోజులు సాంస్కృతిక శాఖ మంత్రిగా,మరికొద్ది రోజులు విదేశీ వ్యవహారాల శాఖసహాయ మంత్రిగా ఉన్నారు.

2018 లో ఆయన దాదాసాహెబ్ పాల్కే అవార్డు మరణానంతరం లభించించి. సీనిరంగంలో ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు.మేరా గావ్ మేరాదేశ్, అచానక్,ముకద్దర్ కా సికందర్, ఇన్ కార్, అమర్ అక్బర్ అంథోని, ఖుర్బానీ, చాందినీ వంటి చిత్రాలు ఆయనను తారాస్థాయికి తీసుకెళ్లాయి. ఇలాంటి దశలోనే ఆయన రజనీష్ ఒషో వాదన వైపు మళ్లి కొద్ది రోజులు సినిమాలకు స్వస్తిపలికారు.

తర్వాత బాలివుడ్ కు తిరిగి వచ్చి కొన్ని సినిమాలు తీసినా చివరకు బిజెపిలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రతిసారి గురుదాస్ పూర్  నుంచే పోటీ చేస్తూ వచ్చారు.ఆయన  మరణించాక గురుదాస్ పూర్ టికెట్ తనకే వస్తుందని భార్య కవితా ఖన్నా ఆశించారు. బిజెపి మాత్రం ఆమెను గుర్తించలేదు.

కర్నాటక సుమలత పరిస్థితే ఆమెకు ఎదురయింది. రాజకీయాల్లో భర్త వారసత్వం కొనసాగించాలనుకున్న సుమలతకు అంబరీష్ మరణానంతరం మాండ్య లోక్ సభ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. మాండ్య నుంచి అంబరీస్ పలుమార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు.

ఆయన మరణించాక తనకు ఆయన రాజకీయ వారసత్వం దక్కుతుందని సుమలత  ఆశించి కాంగ్రెస్ చేతిలో భంగపడ్డారు. అయితే, పెద్ద ఎత్తున అంబరీష్ అభిమానులసైన్యం ఉండటంతో సుమలత ఏ పార్టీలో చేరకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టిస్తున్నారు.

పార్టీ నిర్లక్ష్యానికి గురయిన కవితా ఖన్నాకు అభిమానుల అండ లేదు. అభిమానుల అండ అనేది దక్షిణ భారత లక్షణం. కవితా ఖన్నా ఇండిపెండెంటుగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోయారు. అలాగని బిజెపిలో ఎదురవుతున్న అవమానాన్ని దిగమింగుకో లేకపోతున్నారు.అందుకే తన మనోగతాన్ని ఎఎన్ ఐ వార్త సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు.

పంజాబ్ లో గురుదాస్ పూర్ నుంచి బిజెపి సన్నీడియోల్ ను నిలబెడుతూ ఉంది. వినోద్ ఖన్నా రెండో వర్ధంతి సందర్భంగా ఈ అన్యాయాన్ని భరించలేక ఆమె కంట తడిపెట్టుకున్నారు.

‘నాకు ద్రోహం జరిగింది. గురుదాస్ పూర్ నుంచి ప్రజలు నన్ను వాళ్ల ప్రతినిధిగా చూడాలనుకున్నారు. బిజెపి ప్రజాభీష్టాన్ని కూడా ఖాతరు చేయలేదు,’ అని ఆమె ఆవేదన చెందారు.
అయితే, మరొక పార్టీ నుంచి నిలబడే ఆలోచనలేదని చెప్పారు. తనని చాలా పార్టీలు సంప్రదించాయని, ఆ పార్టీలలో చేరా ఆలోచన లేదని ఆమె తెలిపారు.

కనీసం సన్నీడియోల్ క్యాంపెయిన్ చేయాలని కూడా ఎవరూ తనని అడగక పోవడం కూడా ఆమె బాధిస్తూ ఉంది.

గురుదాస్ పూర్ లోక్ సభ టికెట్ తనకు ఇస్తామని చెప్పి ఇలా ద్రోహం చేశారని ఆమె ఆవేదనతో చెప్పారు. ‘ఎన్నికల్లో నిలబడేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. గురుదాస్ పూర్ ప్రజలు కూడా నాలో వినోద్ ఖన్నాను చూడాలనుకున్నారు.చివరకు బిజెపి నాకు టికెట్ తిరస్కరించింది. ఈ నిర్ణయంతో స్థానిక ప్రజలు కూడా నిరాశ చెంది, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నామీద వత్తిడి తీసుకువచ్చారు. నిజంగా చెబుతున్నాను, నా మనసు గాయపడింది. గురుదాస్ పూర్ సీటు విషయంలో ఏ నిర్ణయమయినా తీసుకునే హక్కు పార్టీకి ఉంది.అయితే, నాకు అన్యాయం జరిగింది. పార్టీ నన్ను వదిలేసిందిలా,’ అని కవితా ఖన్నా చెప్పారు.