రామాయణాన్ని రాజకీయాలను ముడిపెడుతూ పాత్రలను సృష్టించడం సహజమే. రాజకీయ నాయకులను దేవుళ్లుగా చిత్రీకరించడమూ మనకు తెలుసు. నచ్చిన వారిని దేవుళ్లుగా, నచ్చని వారిని రాక్షసులుగా పేర్లు పెడుతుంటారు ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానులు. ఇలా గిల్లికజ్జాలు పెట్టుకోవడం కార్యకర్తలు, అభిమానులకే పరిమతం కాలేదు. రాష్ట్ర స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు కూడా తరచూ నోరుజారుతుంటారు. ఈ ఘటన కూడా అలాంటిదే.
ఇప్పుడిప్పుడే క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ తురుఫుముక్క ప్రియాంకా గాంధీ వాద్రాపై ఇలాంటి కామెంట్లే పడుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రియాంకా గాంధీ వాద్రా అందంపై బిహార్ మంత్రి ఘాటు కామెంట్లు చేశారు. ఆమె అందాన్ని ప్రజలు చూసి ఓట్లేయరని చెప్పుకొచ్చారు.
తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కూడా ప్రియాంకా గాంధీ వాద్రాను టార్గెట్‌గా చేసుకున్నారు. ఆమెను `శూర్పనఖ`గా అభివర్ణించారు. రాజకీయం అనే రామాయణంలో శ్రీరామచంద్రుడు ప్రధాని నరేంద్రమోడీ అని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ రావణుడని చెప్పారు.
`శ్రీరాముడనే నరేంద్రమోడీని అడ్డుకోవడానికి రావణుడనే రాహుల్ గాంధీ తన చెల్లెలు ప్రియాంకా గాంధీ వాద్రా అనే శూర్పనఖను పంపించారు..` అని సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని శ్రీరాముడిగా కీర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిహార్ రాజధాని పాట్నాలో బ్యానర్ ఏర్పాటు చేయడాన్ని సురేంద్ర సింగ్ తప్పుపట్టారు.