ప్రధాని మోదీకి రాజ్యసభ లో ఊహించని ఝలక్

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఇదేమంత మంచి రికార్డు కాదు సుమీ. చెత్త రికార్డు కింద లెక్క. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రధానికి లేని రికార్డు మోదీకి దక్కింది. అదేంటో వివరాలు చదవండి.

ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా రాజకీయ ప్రసంగం చేశారు. గురువారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరిగింది. ఎన్డీఎ అభ్యర్థి హరి వంశ్ నారాయణ్ సింగ్ గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బికె ప్రసాద్ ఓడిపోయారు. ఫలితాల అనంతరం మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థి ని తూలనాడుతూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఉద్దేశించి అమ్ముడుపోయిన వ్యక్తి అన్న అర్థం వచ్చేలా మోదీ కామెంట్స్ చేశారు. దీంతో పెద్ద వివాదం రేగింది.  రాజ్యాంగబద్ధమైన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంలో ఇలా రాజకీయాలు మాట్లాడడం తగదని కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన అభ్యర్థి బికె ప్రసాద్ అభ్యంతరం తెలిపారు. పార్లమెంటు గౌరవాన్ని, ప్రధానమంత్రి గౌరవాన్ని కాపాడాలంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు సిగ్గు చేటు అని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

దీంతో మోదీ వ్యాఖ్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ సభ్యులకు హామీ ఇచ్చారు. అయితే మోదీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వివాదాన్ని రాజేసిన నేపథ్యంలో రాజ్యసభ రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు రాజ్యసభ సచివాలయం ధృవీకరించింది. భారత దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక ప్రధాని మాట్లాడిన మాటలను రాజ్యసభలో రికార్డుల నుంచి తొలగించడం ఇదే తొలిసారి అని రాజ్యసభ అధికార వర్గాలు అంటున్నాయి. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీకి మన్మోహన్ కు మధ్య వాగ్వాదం జరిగింది. అప్పట్లో వారిద్దరి భాషపై అభ్యంతరం వెల్లువెత్తడంతో ఇద్దరి మాటలను రికార్డుల నుంచి తొలగించారు.

కానీ ప్రధాని ఒక్కడి వ్యాఖ్యలే రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించడం మాత్రం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. మొత్తానికి మోదీ సెటైర్ వేయబోయి ఇలా అడ్డంగా బుక్కైన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.