కర్ణాటకలో మరోసారి క్యాంపు రాజకీయాలు రాజుకున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పడరాని పాట్లు పడుతోంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి బొటాబొటిగా మెజారిటీ ఉంది. ఓ అయిదుమంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పార్టీకి దూరమైతే ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నుంచి బయటికి వచ్చారు.
పరిస్థితి చేయి దాటుతుండటాన్ని గ్రహించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు.. శుక్రవారం బెంగళూరు శివాజీనగరలో సమావేశమయ్యారు. అనధికారికంగా సీఎల్పీ భేటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కూడా నలుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రమేష్ జార్కిహోళి, నాగేంద్ర, మహేష్ కుమటహళ్లి, ఉమేష్ జాదవ్ ఈ భేటీకి హాజరు కాలేదు. వారికి ఫోన్ చేసినప్పటికీ.. అవి స్విచాఫ్ వచ్చాయి.
దీనితో అప్రమత్తమైన పీసీసీ నాయకులు.. తమ ఎమ్మెల్యేలను బెంగళూరు శివార్లలోని ఈగల్‌టన్ రిసార్టుకు తరలించారు. వారిని కాపాడుకునే బాధ్యతను సీనియర్ నేత, భారీ నీటి పారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్‌కు అప్పగించారు. సీఎల్పీ సమావేశం ముగిసిన తరువాత రెండు ప్రైవేటు బస్సుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ రిసార్టుకు తరలి వెళ్లారు.
గత ఏడాది మేలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ కర్ణాటకలో ఇదే తంతు కొనసాగుతోంది. ఆపరేషన్ కమల పేరుతో మ్యాజిక్ ఫిగర్‌ను సాధించడానికి అటు కమలనాథులు కూడా కిందామీదా పడుతున్నారు. ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అవి బెడిసికొడుతున్నాయి.