నిత్య పెళ్లి కొడుకు… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు!

పెళ్లీడుకొచ్చిన కూతుర్లకు పెళ్లి చేయాలని ప్రతి తల్లి తండ్రి ఎన్నో కలలు కంటూ ఉంటారు. కూతురి వివాహం చేయటం కోసం ఎంతో కష్టపడి డబ్బు దాచుకొని ఘనంగా కూతురికి వివాహం చేసి అత్తవారింటికి పంపుతూ ఉంటారు. అయితే కొంతమంది ఆడపిల్లలు అత్తవారింట్లో సంతోషంగా ఉండగా మరి కొంతమంది మాత్రం కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. పెళ్లి చేసే సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి గురించి విచారణ చేయకుండా గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. ఇలాంటి తల్లిదండ్రులను ఆసరాగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఉద్యోగం ఆస్తి ఉందంటూ వివాహం చేసుకొని కొంతకాలానికి వారిని వదిలేసి మరొక యువతిని వివాహం చేసుకుంటున్నారు .

తాజాగా ఇలా అమ్మాయిలను మోసం చేస్తూ వేరొకరిని పెళ్ళి చేసుకున్న నిత్య పెళ్ళికొడుకుని పోలిసులు అరెస్టు చేశారు. వివరాలలోకి వెళితే…రామనాథపురం జిల్లా పరమక్కుడికి చెందిన కార్తీక్‌ రాజా(26) అనే వ్యక్తి ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగి. విరుదునగర్‌ జిల్లా సాత్తూరు సమీపంలోని వల్లంపట్టికి చెందిన జాన్సీరాణి(20) అనే యువతిని ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. కొంతకాలం ఇద్దరు చాలా సంతోషంగా జీవించారు. ఆ తర్వాత ఆమె వద్ద 5 సవర్ల చైన్‌ తీసుకుని విదేశానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోయాడు . ఆ తర్వాత చాలా రోజుల వరకు తన భర్త గురించి ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో జాన్సిరాణీ తన భర్త ఆచూకీ తెలియటం లేదని ఏలాయిరమ్‌ పన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో జాన్సి రాణీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్‌ రాజా కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కార్తీక్ రాజా తిరువణ్ణామలై జిల్లాలో ఉన్నట్లు తెలుకుని పోలీసులు అక్కడికి వెళ్లి శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఏలాయిరమ్‌ పన్నై పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి అతన్ని విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. గత కొన్ని సంవత్సరాలుగా కార్తీక్ రాజా వివిధ గ్రామాలకు చెందిన 20 మందికి పైగా మహిళలను పెళ్లి చేసుకుని వారి నుంచి 80 సవర్లకు పైగా నగలు తీసుకుని వారిని మోసం చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. అంతే కాకుండా ఇతనిపై కోయంబత్తూరు, ఏలాయిరమ్‌ పన్నై, సాత్తూర్ , విల్లుపురంతో పాటు పలు పట్టణాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.