మ్యాగీ నూడిల్స్ మస్త్ డేంజర్

మ్యాగీ నూడిల్స్ తింటున్నారా.. అయితే ఇప్పుడు మీరు కాస్త ఆలోచించాల్సిందే. అవును ఎందుకంటే మ్యాగీ నూడిల్స్ ప్రాణాంతకమైనదని స్వయంగా ఆ సంస్థే కోర్టులో అంగీకరించింది. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ నూడీల్స్ లో ప్రాణాంతక సీసం ఉన్న మాట వాస్తవమేనని నెస్లే సంస్థ ఒప్పుకుంది.

మ్యాగీ నూడీల్స్ చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా దీనిని తింటారు. క్షణాల్లో రెడీ చేసుకొని దీనిని ఇష్టంగా ఆరగిస్తారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా దీనిని అమితానందంగా తింటారు. మ్యాగీ నూడీల్స్ లో అత్యంత ప్రమాదకరమైన సీసం అవశేషాలు ఉన్నాయని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ తేల్చింది. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని నెస్లే ఇండియాకు 640 కోట్ల రూపాయల జరిమానా విధించాలని 2015లో కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ … జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో కేసు వేసింది.

అప్పట్లో కేసు విచారణ పై సుప్రీం కోర్టు స్టే విధించి నూడిల్స్ ను పరీక్షించాలని సీఎఫ్ టిఆర్ ఐని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో నూడిల్స్ ను పరీక్షించిన సీఎఫ్‌టీర్‌ఐ అందులో ప్రాణాంతక సీసం ఉన్నమాట నిజమేనని పేర్కొంది. తాజాగా ఈ కేసు విచారణకు సంబంధించిన వాదనలు ప్రారంభమయ్యాయి. సీసం ఉన్న నూడిల్స్ ను ఎందుకు తినాలంటూ నెస్లే తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కోర్టు ప్రశ్నించింది.

దానికి న్యాయవాది బదులిస్తూ సీసం ఉన్న మాట వాస్తవమేనని కాకపోతే అది అనుమతించిన మోతాదులోనే ఉందన్నారు. అది ప్రాణాంతకం కాదన్నారు. దీంతో ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్రం వేసిన కేసును విచారించేందుకు జస్టిస్ డీవీ చంద్రచూడ్, హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం అనుమతించింది.