రాహూల్ కూ వెన్నుపోటేనా ?

చంద్రబాబునాయుడు వరస చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ తో పొత్తులని చెబుతూనే మరోవైపు అదే కాంగ్రెస్ నేతలను టిడిపిలోకి చేర్చేసుకుంటున్నారు. నాలుగున్నరేళ్ళల్లో కాంగ్రెస్ నుండి చాలామంది నేతలు టిడిపిలోకి వైసిపి, బిజెపి, జనసేనలో చేరిపోయారు. అంటే కాంగ్రెస్ లో ఇంకా అడుగు బొడుగు మిగిలే ఉన్నారు లేండి. అలా మిగిలిన అడుగు బొడుగును తాజాగా చంద్రబాబు మళ్ళీ లాగేసుకుంటున్నారు. కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉదంతమే అందుకు నిదర్శనం. మామూలుగా రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నపుడు రెండు పార్టీలూ లాభపడాలి, అదే పొత్తు ధర్మం. కానీ అదేమి విచిత్రమో కానీ పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు మాత్రమే లాభపడుతారు. రెండో పార్టీ పరిస్ధితి దుంపనాశనమే. 

చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే ఏమవుతుందో పోయిన ఎన్నికల్లో బిజెపి పరిస్దితి చూస్తే అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. పోయిన ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న బిజెపి, మద్దతిచ్చినందుకు పవన్ కల్యాణ్ ఏమయ్యారో అందరూ చూస్తున్నదే. విచిత్రమేమిటంటే పూర్తిగా తెలిసికూడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణాలో అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్ టిడిపితో పొత్తు పెట్టుకుని దుంప నాశనమైపోయింది. ఆ విషయాన్ని ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలే సుమా.

ఇపుడు కూడా కాంగ్రెస్ తో పొత్తన్నారు. అంటే తెలంగాణా దెబ్బకు కాంగ్రెస్ తో నేరుగా పొత్తుండదని చంద్రబాబు ఏకపక్షంగా తేల్చేశారు లేండి. కాకపోతే స్నేహం మాత్రం మెయిట్ టైన్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలతో ప్రైవేటుగా మాట్లాడుతునే ఉన్నారు. అదే సమయంలో ఢిల్లీకి వెళ్ళినపుడల్లా ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధీని కలుస్తునే ఉన్నారు. అంటే ఒకవైపు స్నేహం చేస్తునే మరోవైపు కాంగ్రెస్ నేతలను టిడిపిలోకి లాగేసుకుంటున్నారు.  కాంగ్రెస్ తో స్నేహం చేస్తునే ఆ పార్టీ నేతలను లాగేసుకోవటాన్ని ఏమంటారు ?