ప్రేమికురాలు మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ప్రేమికుడు ఏం చేశాడంటే

వైభవంగా పెళ్లి జరుగుతోంది. బంధుమిత్రులతో పెళ్లి మండపం కళకళలాడుతోంది. సిగ్గులమొగ్గలైన పెళ్లికూతురు పెళ్లిపీటలపై కూర్చుకుంది. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.

అప్పటి వరకు కళకళలాడిన పెళ్లి మండపం హాహాకారాలతో హోరెత్తింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే జరగరాని నష్టం జరిగిపోయింది. పెళ్లిపీటలపై కూర్చున్న వధువు విగతజీవిగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలోని ఘజియాపూర్‌లో జరిగిందీ దారుణం.

పోలీసుల కథనం ప్రకారం.. బిజేంద్ర-ఆశ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలన్న వీరి కోరికకు ఆశ కుటుంబ సభ్యులు అడ్డు పడ్డారు. అంతేకాదు, వేరే వ్యక్తితో ఆమెకు పెళ్లి నిశ్చయించారు. తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గిన ఆశ పెళ్లికి అంగీకరించక తప్పలేదు.

ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లాడబోతోందన్న విషయం తెలిసిన బిజేంద్ర జీర్ణించుకోలేకపోయాడు. తుపాకితో పెళ్లికి వచ్చి ఆశాపై కాల్పులు జరిపాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశ పెళ్లిపీటలపైనే ప్రాణాలు విడిచిపెట్టగా, బిజేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.