ఒక్కరికే షాక్ ఇస్తే ఏం బావుంటుంది.? ఒకేసారి రెండు రాష్ట్రాలకు షాకిస్తే ఆ కిక్కే వేరప్పా.. అనుకుంటున్నట్టుంది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్. అమరావతి మీదుగా రైల్వే లైన్ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశానికీ బ్రేక్ వేసేసింది. దాంతో, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలూ గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి. రాజధాని అమరావతిని కేవలం శాసన వ్యవహారాలకే పరిమితం చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించుకోవడం కేంద్రానికి బాగా కలిసొస్తోంది. రాష్ట్రం తరఫున అమరావతి రైల్వే లైను విషయమై అంత ఆసక్తి కనిపించకపోవడంతో, చాలా తేలిగ్గా ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం. మరి, తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం మాటేమిటి.? అంటే, ఇక్కడి పరిణామాలు పూర్తి భిన్నం. అసలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి వున్నట్లే కనిపించడంలేదు. ఐటీఐఆర్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి – భారతీయ జనతా పార్టీ మధ్య తెలంగాణలో మాటల యుద్ధం నడుస్తోంది.
ఐటీఐఆర్ ద్వారా తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందనీ, విశ్వనగరం దిశగా హైదరాబాద్ మరో కీలకమైన ముందడుగు వేయడానికి వీలుపడుతుందన్నది టీఆర్ఎస్ ప్రభుత్వ వాదన. కాంగ్రెస్ హయాంలో ఐటీఐఆర్, తెలంగాణకు మంజూరు కాగా, బీజేపీ హయాంలో అది అటకెక్కింది. ఇంతలోనే, ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనవసరం అని కేంద్రం తేల్చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. విశాఖ రైల్వే జోన్ ఇంతవరకు రాలేదు. దానిపైనా గందరగోళం కొనసాగుతోంది. కొత్త రైల్వేజోన్ ప్రకటించేసి చేతులు దులిపేసుకుంది కేంద్రం. ఇంతటి బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని తలపండిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంటే, ఏపీ బీజేపీ నేతలు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే.